Business

ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ హెచ్చరిక

ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ హెచ్చరిక

‘తమలపాకుతో నువ్వు ఒకటి అంటే, తలుపు చెక్కతో నేను ఒకటి అంటా’ అన్న తీరుగా ఉంది అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం. ఒకరిని చూసి ఒకరు ఇరు దేశాల దిగుమతి వస్తువులపై సుంకాలను బాదుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాను చైనా మరోసారి హెచ్చరించింది. సెప్టెంబరు 1 నుంచి చైనా దిగుమతులపై వాషింగ్టన్‌ పన్నులు పెంచే యోచన చేస్తే అందుకు తప్పక మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. గురువారం ఈ మేరకు చైనా మంత్రివర్గం ఒక ప్రకటన చేసింది. ‘చైనా దిగుమతులపై అదనపు పన్నులు వేస్తే తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోము’ అని కాస్త గట్టిగానే చెప్పింది. కాగా, మరోపక్క చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనంగా మరో 10శాతం సుంకం పెంచాలని అనుకుంటున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అయితే, వాటిలో 60శాతం వస్తువులపై పన్నులను విధించాలన్న నిర్ణయాన్ని డిసెంబరు వరకు వాయిదా వేస్తున్నట్లు మాత్రం చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా అధికార వర్గాలు స్పందించలేదు. ముఖ్యంగా మొబైల్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, వీడియో గేమ్‌ కన్సోల్స్‌, కొన్ని రకాల బొమ్మలు, కంప్యూటర్‌ మానిటర్‌లు, షూలు, బట్టలపై 10శాతం పన్నులు విధిస్తే దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై దీని ప్రభావం పడనుంది. ఇరు దేశాల వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే వస్తువులు 19శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులు సైతం 6.5శాతానికి తగ్గాయి. అమెరికా విధిస్తున్న సుంకాలను భరించలేక చైనా తన దిగుమతులను తగ్గించింది. ఇక మరికొన్ని వస్తువులకు అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.