Devotional

గురువాయూర్ శ్రీకృష్ణుని లీలామృతం

గురువాయూర్ శ్రీకృష్ణుని లీలామృతం-Leelas Of Guruvayur Sree Krishna

దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు.కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే,పుట గడవడానికి కూడా జరుగుబాటు లేదు.వారికి తెలిసిందల్లా వంట చేయడమే.దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు , మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని ,వంట చేయడానికి వంట మనుషులు కావాలనీ వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు.ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వొంగిపోయి,నిలబడడానికే శక్తిలేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా !!! అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయస్సులో మీరు వంట చేయటానికి వచ్చారే! ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో 1000 గుండిగల అన్నం , కూరలు ,పప్పు,చారు అన్నిరకాలు చేయాలి ,ఈ వయసులో మీరు అంత పని చేయగలరా! ఈ వయస్సులోకూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయటానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు.కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్దులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి.మా ప్రయత్నం మేము చేస్తాము , అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు.బానే ఉంది మీరు చెప్పేది,మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి ? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా ? ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి , మేము ప్రయత్నిస్తాము,ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు. సరే చూస్తాను,తేడా వచ్చిదంటే ముసలివాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త అన్నాడు . గురువాయిరుప్పా ! నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయచ్చు, దేనినైన సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించాగానే కలుగుతుంది ప్రభూ, నీ మీదే భారం వేసాము మమల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్లిపోయారు.మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గం.లకు నిద్ర లేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు.అప్పుడు వాళ్లకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొఖం కడుకుంటూ కనిపించాడు.వాళ్ళు ఆశ్చర్యంతో నాగోరి! నువ్వు ఎప్పుడు వచ్చావ్ ఇక్కడికి అని అడిగారు,అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది,వృద్దులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని అన్నాడు.ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది.అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు.వంట పని మొదలు పెట్టారు.ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేసారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్నీ చక చక పూర్తి చేసాడు.ఉదయం 9 గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర , అన్నిరకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు.వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి , చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాప పడి, క్షమాపణలు చెప్పి, నలుగురు కృష్ణ భక్తులకూ ఘనంగా సత్కారం చేసి,పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరీ గురించి ఆ కార్యనిర్వహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా ” నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి,నాకోసం అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు ” అన్ని చెప్పి నాగోరీ భోజనం కూడా చేయకుండానే అక్కడినుండి వెళిపోయాడు.ఆ నలుగురు భక్తులూ భోజనం చేసి గురువాయూర్ వెళ్లారు.వాళ్ళు ఆ ఆనందంలో,ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్ లో దర్శనం చేసుకొని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఉరికి వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి నలుగురికీ ఒకే కల వచ్చింది.ఆ కలలో ” గురువాయూరప్పన్ కనిపించి భక్తులారా ! నాగోరి లాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేపించుకొని కూలి ఇవ్వకపోవటం మీకు న్యాయమేనా ” అని అడిగాడు.ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు.ఆశ్చర్యం అందరికీ ఒకే కల వచ్చింది, అది కలా కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం , సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనందబాష్పాలు రాలుస్తూ , గురువాయురప్పని కీర్తిస్తూ , జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామి వారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు.ఆ సంఘటన మూలంగా ఇప్పటికి కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పన్ కి పూజలు చేస్తున్నారు.ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికీ వచ్చిన కూలిడబ్బులో ఒక వంతు దేవుడికి నేటికీ సమర్పిస్తున్నారు.