కావల్సినవి:
మైదా – కప్పు, నెయ్యి – టేబుల్‌స్పూను, ఉప్పు – చిటికెడు, నీళ్లు – పిండి కలిపేందుకు, బియ్యప్పిండి – పావుకప్పు, నూనె – వేయించేందుకు సరిపడా.
పాయసం కోసం కావల్సినవి: తాజా కొబ్బరి తురుము – కప్పు, గసగసాలు – రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు – ఎనిమిది, పాలు – ఒకటిన్నర కప్పు, నీళ్లు – అరకప్పు, బెల్లం తురుము – ఒకటింబావు కప్పు, యాలకులపొడి – అరచెంచా.
తయారీ:
ఓ గిన్నెలో మైదా, ఉప్పు తీసుకోవాలి. దానిలో సరిపడా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలపాలి. తరవాత నెయ్యి వేసి మరోసారి కలిపి ఇరవై నిమిషాలు నాననివ్వాలి. ఆ తరవాత కొద్దిగా పిండి తీసుకుని బియ్యప్పిండి అద్దుకుంటూ పల్చని పూరీలా చేసుకుని మధ్యకు మడవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఒక్కోదాన్ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పాయసం తయారు చేసుకోవాలి. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టి బెల్లం తురుము వేయాలి. అది కరిగేలోగా కొబ్బరి తురుమూ, గసగసాలూ, జీడిపప్పూ, యాలకులపొడి మిక్సీలో తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. బెల్లం కరిగాక ఆ పాకాన్ని ఒకసారి వడకట్టి.. మళ్లీ పొయ్యిమీద పెట్టాలి. అందులో ముందుగా చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. నిమిషం అయ్యాక కాచి చల్లార్చిన పాలు కూడా పోసి బాగా కలిపి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు పూరీలను పళ్లెంలో రెండుమూడు చొప్పున సర్ది..వాటిపై ఈ పాయసాన్ని కొద్దిగా వేయాలి.