Business

అంబానీ ఆస్తులు ఆగకుండా పెరిగిపోతున్నాయి

Mukesh Ambani Becomes Unstoppable Amassing Wealth-అంబానీ ఆస్తులు ఆగకుండా పెరిగిపోతున్నాయి

రిలయన్స్‌ అధినేత, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ సంపద అప్రతిహతంగా పెరుగుతోంది. ప్రధానంగా  జియో ఫైబర్‌ ప్రకటన అనంతరం అంబానీ మునుపెన్నడూ లేనంతగా అమాంతం ఎగిసింది.  దీంతో 49.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచారు.  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ఆధారంగా ముఖేష్ అంబానీ  ఆగస్టు  12న  రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం రెండురోజుల్లోనే రూ.29వేల కోట్లు మేర పుంజుకున్నాయి. మార్కెట్ వ్యాల్యూ రూ.80,000 కోట్లకు పెరిగింది. 42వ రిలయన్స్ ఏజీఎంలో సౌదీ కంపెనీ ఆరామ్‌కోతో అతిపెద్ద ఎఫ్‌డిఐ డీల్‌ను ప్రకటించారు. 20శాతం వాటాలు ఆరామ్‌కోకు విక్రయిస్తున్నామనీ, తద్వారా రానున్న 18 నెలల్లో (మార్చి 2021 నాటికి) రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు లేని కంపెనీగా అవతరించనుందని  ప్రకటించడం ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది.  అలాగే అతి తక్కువ ధరలు, బంపర్‌ ఆఫర్లతో  గిగా ఫైబర్‌ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మూడీస్‌, మోర్గాన్‌ స్టాన్లీ లాంటి సంస్థలు రిలయన్స్‌కు అప్‌గ్రేడ్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. దీంతో మంగళ, బుధవారాలు రిలయన్స్ షేర్లు దలాల్‌ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. బుధవారం మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.1,288.30వద్ద ఉండగా, శుక్రవారం  రూ.1,279 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఆగస్ట్ 12వ తేదీ ప్రకటన తరువాత రిలయన్స్‌ షేర్లు 11 శాతం పెరిగాయి. అదే విధంగా అంబానీ ఆస్తులు 4 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 28,684 కోట్లు పెరిగింది. వార్షిక​  ప్రాతిపదికన అంబానీ సంపద 6 శాతం పెరగ్గా, రిలయన్స్‌ షేర్లు 15 శాతం ఎగిసాయి.