Agriculture

తెలంగాణా ఆక్వా రైతులకు చేపపిల్లల పంపిణీ

Talasani Distributes Fishlets To Aqua Farmers In Telangana-తెలంగాణా ఆక్వా రైతులకు చేపపిల్లల పంపిణీ

తెలంగాణలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వందశాతం పూర్తి రాయితీపై తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కోయిల్‌ సాగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేపపిల్లలను వదిలిపెట్టి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్ణ ప్రాజెక్టులో మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 15 రోజుల్లోగా చేపపిల్లల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇటీవల కురిసిన జోరు వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నీటి వనరుల్లో చేపపిల్లల విడుదలకు ఇదే మంచి సమయమని ప్రభుత్వం భావించింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ చేపడుతోంది. ఈ ఏడాది 24,953 నీటివనరుల్లో రూ.52కోట్ల విలువైన చేపపిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 80.86 కోట్ల చేపపిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో వేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ నగర శివార్లలోని మడికొండ పెదచెరువు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పెదపెండ్యాల చెరువులో చేపపిల్లలను వదిలారు.