Devotional

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

1. యాదాద్రిలో కేసీఆర్‌ – ఆద్యాత్మిక వార్తలు -08/17
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.అక్కడి నుంచి పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలిస్తారు. తుదిదశకు చేరుకుంటున్న ఆలయ నిర్మాణాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం సీఎం స్థల పరిశీలన చేయనున్నట్లు సమాచారం. దాదాపు 100 ఎకరాలు అవసరమని భావిస్తున్న ముఖ్యమంత్రి అందుకు అనువైన ప్రాంతం గురించి చర్చించే అవకాశముంది. త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సూచనల మేరకు యాగస్థల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. రహదారి ప్రయాణంలో రాయగిరి సమీపంలోని మినీ ట్యాంక్‌బండ్‌, అభయారణ్యం, సుందరీకరణ పనులను అడిగి తెలుసునే అవకాశముంది. సాయంత్రం కేసీఆర్‌ హైదరాబాద్‌ చేరుకుంటారు.
2. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
దిల్లీకి చెందిన శ్రీనివాస కృష్ణ తిరుమలలోని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని సమర్పించారు. గురువారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ట్రస్టు ప్రత్యేకాధికారి వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి జీఎల్ఎన్ శాస్త్రిని కలిసి డీడీలను అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అన్నప్రసాద పథకం వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ పథకం నిర్వహణ బాగుందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
3. క్రీస్తుకు పూర్వమే అయోధ్యలో దేవాలయం
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో క్రీస్తుకు పూర్వం రెండో శతాబ్దం నాటికే అతి పెద్ద రామ మందిరం ఉందని రామ్ లల్లా విరాజ్మాన్ సంస్థ తరఫు న్యాయవాది వైద్యనాథన్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కూడా విచారించింది. బాబ్రీమసీదు నిర్మాణానికి ముందే ఈ దేవాలయం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో కోర్టు నియమించిన కమిషనర్ 1950లో అయోధ్యను సందర్శించి, సమర్పించిన నివేదికను, పురావస్తు శాఖ (ఏఎస్ఐ) కనుగొన్న ఆధారాలను ధర్మాసనానికి చూపించారు. ఎఎస్ఐ నివేదిక మేరకు స్తంభాలతో కూడిన ఆ పెద్ద నిర్మాణాన్ని మండపంగా భావించారని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోని స్తంభాలపై దేవతామూర్తుల చిత్రాలు ఉన్నాయని కూడా కమిషనర్ ఇచ్చిన నివేదికలో ఉందని వైద్యనాథన్ తెలిపారు.
4. అత్తి వరదర్ను దర్శించుకున్న భక్త‘కోటి’
నేడు జలావాసానికి స్వామి
తమిళనాడులోని కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్ ఆలయంలో నిర్వహిస్తున్న అత్తి వరదర్ ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజైన శుక్రవారం ఉదయం స్వామి వారిని రోజారంగు పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ ఆలయంలో 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజులపాటు అత్తి వరదర్ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం జులై ఒకటిన ప్రారంభమైన ఉత్సవాల్లో 31 రోజులపాటు శయన అవతారంలో..ఆగస్టు ఒకటి నుంచి నిలబడిన అవతారంలో దర్శనమిచ్చారు. వీఐపీ, వీవీఐపీల దర్శనాన్ని గురువారం మధ్యాహ్నంతో ముగించి…శుక్రవారం ఉచిత దర్శనం మాత్రమే కొనసాగించారు. గురువారం రాత్రి వరకు సుమారు కోటి మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని జిల్లా కలెక్టరు పొన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం భారీగా భక్తులు తరలివచ్చారు. 17న ఉదయం వరకు దర్శనానికి అనుమతించి…సాయంత్రం లేదా రాత్రికి అనంత సరస్సులో జలావాసానికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
5. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ వినీత్ శరణ్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ దంపతులు శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. న్యాయమూర్తికి తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జస్టిస్ వినీత్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చి.. నిర్వహణ తీరును పరిశీలించారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులతో ముచ్చటించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
6. శ్రీవారి నాణేల చెలామణికి మోక్షం
వడ్డీ కాసులవాడు శ్రీవేంకటేశ్వర స్వామివారికి కానుకగా వస్తున్న చిల్లర నాణేలను చెలామణిలోకి తీసుకురావడం ఇప్పటిదాకా తిరుమల, తిరుపతి దేవస్థానానికి పెద్ద సమస్యగా మారింది. నోట్లు తప్ప నాణేలు తీసుకోవడానికి బ్యాంకర్లు నిరాకరించడంతో భారీగా పేరుకుపోయాయి. గతంలో చెల్లుబాటుగాని నాణేలను తమిళనాడు రాష్ట్రం సేలంలోని స్టీల్ ప్లాంటుకు తూకం కింద టన్నుల కొద్దీ విక్రయించారు. అనంతరం మరో రూ.20.50 కోట్ల విలువైన నాణేల నిల్వలున్నాయి. నెలకు రూ.5 కోట్ల మేరకు నిల్వలో చేరుతున్నాయి. వీటిని చెలామణిలోకి తేనందున వడ్డీ రూపంలోనూ తితిదే నష్టపోవాల్సి వస్తోంది. దేశంలోనూ చిల్లర సమస్యకు ఇక్కడి నిల్వలూ కొంత కారణమన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చిన వివిధ బ్యాంకుల ఎండీలతో తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి సమావేశమయ్యారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నాణేలు తీసుకెళ్లి తితిదే ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తిరుమలలోని వివిధ బ్యాంకులు అంగీకరించాయి.
7. చాగంటి సీడీలపై విచారణ-ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌
ఎస్వీబీసీలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకు సంబంధించి గత ప్రభుత్వం రూ.25 లక్షలతో సీడీలు రూపొందించడంపై విచారణ చేపడతామని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
8. షిర్డీ, శబరిమలల్లో ప్రభుత్వ వసతి గృహాలు
రాష్ట్రం నుంచి షిర్డీ, శబరిమలకు వెళ్తే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ రెండు చోట్లా భూమిని కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున వసతి, అతిథి గృహాలు నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రెండు రాష్ట్రప్రభుత్వాలతో పాటు షిర్టీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ట్రస్ట్‌లతో సంప్రదించాలని కోరారు.
9. ఆధార్, ఓటర్ కార్డులను తిరుపతికి మార్చేసుకున్నా..’
శ్రీవేంకటేశ్వర భక్తి ఛాల్‌లో పనిచేస్తున్న సిబ్బందిని సీఎం జగన్‌ కాళ్ళు పట్టుకునైనా పర్మినెంట్‌ చేయిస్తానని ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృధ్వీరాజ్‌ హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీనియర్‌ నటుడు ప్రభాకర రెడ్డి ఆదరణతో సినీ పరిశ్రమలో అడుగిడిన తాను దర్శక బ్రహ్మ బాపు వద్ద అసిస్టెంట్‌గా పని చేశానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో జన్మించినా….. శ్రీకాళహస్తిలో తన పెద్దమ్మ ఇంట్లో ఉండి చిన్నతనంలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఎస్వీబీసీ చైర్మన్‌ అయిన వెంటనే ఆధార్‌, ఓటరు కార్డులను తిరుపతికి మార్చుకుని ఇక్కడే ఉంటూ స్వామివారికి సేవ చేస్తున్నానని పేర్కొన్నారు.ఓ ఛానల్లో సినిమావార్తలు రాసిన అనుభవం తనకుందని చెప్పారు. తిరుమలలో అజెండాలు తప్ప, రాజకీయ జెండాలు ఉండవని, తాను తిరుమలలో రాజకీయాలు మాట్లాడబోనని తెలిపారు.ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286మంది ఉద్యోగులకు న్యాయం చేస్తానన్నారు.ఎస్వీబీసీ అభివృద్ధికి మీడియా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. త్వరలో ఎస్వీబీసీ ప్రసారాలను హిందీలో కూడా ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి జె.భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు బాలచంద్ర, సురేంద్రరెడ్డి తదితరులు పృధ్వీరాజ్‌ను ఘనంగా సన్మానించారు.