Movies

సంక్రాంతి లోపు పార్టీ పేరు చెప్తా

I will reveal my partys name before pongal says rajinikanth

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వచ్చే ఏడాది సంక్రాంతిలోపు కొత్త పార్టీ ప్రారంభించనున్నారా? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ‘ఔను’ అనే సమాధానాన్నే ఇస్తున్నాయి. శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అందుకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతిలోపు పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. తాజాగా కరాటే త్యాగరాజన్‌ చేసిన వ్యాఖ్యలు వాటికి అద్దం పడుతున్నాయి. శాసనసభ ఎన్నికలు మాత్రమే తమ లక్ష్యమంటూ ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రజనీకాంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించి రెండేళ్లవుతున్నా పార్టీని మాత్రం ఆయన ప్రారంభించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా రజనీకాంత్‌ వైఖరి ఆయన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పలు ఊహాగానాలను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గురించి పాత్రికేయులు అడిగే ప్రశ్నలకు సున్నితంగా సమాధానం ఇవ్వడమో, స్పందించకుండా వెళ్లిపోవడమే జరిగేది. ప్రస్తుతం ఆ వైఖరి పూర్తిగా మారింది. తన స్పందనను కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. కశ్మీర్‌ వ్యవహారంలో భాజపా నిర్ణయంపై రజనీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. దీంతో ఆయన త్వరలో పార్టీని ప్రారంభించనున్నారనే వార్తలు వినిపించాయి. 2017 డిసెంబరు 31న తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించి 2018వ ఏడాదికి అభిమానులకు కానుక అందించినట్టే… ఈ ఏడాది ఆఖరులో కొత్త పార్టీ పేరు, జెండా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కూడా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. దీనిని రజనీకాంత్‌కు సన్నిహిత మిత్రుడు, కాంగ్రెస్‌ ప్రముఖుడు కరాటే త్యాగరాజన్‌ వ్యాఖ్యలు నిర్ధారిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రజనీకాంత్‌ పార్టీ ప్రారంభిస్తారని, అప్పుడు కచ్చితంగా తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరుణానిధి, జయలలిత లేని శూన్యతను ఆయన మాత్రమే భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.