Editorials

విజయవాడలో వరద రాజకీయంపై ఓ విశ్లేషణ

The flood politics of vijayawada

చంద్రబాబు అద్దె ఇల్లు మునిగిపోయింది, అమరావతిలోకి నీళ్లొచ్చాయి అనే ప్రయత్నం లేదా ప్రచారం ఒక పక్షానిది(డ్రోన్లు పెట్టి మునిగిపోతున్న సామాన్యుల వందల/వేలాది ఇళ్లు వాళ్ళ పరిస్థితి చిత్రీకరణ-ఎలా ఆదుకోవాలో ముఖ్యంగానీ ఖాళీ చేసిన పదిమంది పెద్దోళ్ల గెస్ట్ హౌసుల సొగసుల చిత్రీకరణ ముఖ్యమా…. నది కుడివైపున అక్కడ తీసేదగ్గర ఒక్క సామాన్యుని ఇల్లుందా? అక్కడ డ్రోన్ వేస్ట్). చంద్రబాబుగారి అద్దె ఇల్లు ముంచడానికే మొత్తం ప్రజలని ముంచారు అన్నది మరొక పక్షం ప్రచారం. అసలా ఖాళీ చేసిన ఇల్లు మునిగితే ఏమిటి, ఎంత % మునిగిందో సామాన్యులకు ఏమి అవసరం? వందల/ వేలాది ఇళ్ళు మునిగిపోతే ఆ విషయం మీద మీడియా, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు, MLAలు, మంత్రులు అధికారులు పూర్తిగా దృష్టి పెట్టకుండా ఈ రాద్దాంతం ఏమిటి? అసలు ఓ పక్క సోమశిల, కందలేరు రిజర్వాయర్లు నేటికీ తమ సామర్థ్యంలో 5% నీళ్లు నిండక భోరుమంటున్నాయి, వాటికీ ఇంకా అనేక రిజర్వాయర్లుకు కృష్ణా నీరు అవసరం. కొంతమందికి నమ్మకం కుదరదేమోగానీ తగు వర్షపాతం లేక, నేటికీ చెరువులు నిండక, మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాలు ఏపీలో వేలు ఉన్నాయి. రెండు వారాల ముందే మాలాంటి వాళ్లే 4,5 లక్షల క్యూసెక్కులు రాబోతున్నాయి, ఇంకా పెరగబోతున్నాయి చెబుతూనే ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి కదా. మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నప్పుడు అయినా ఏపీ అధికారులకి అప్పటికే పైన 800కిమీ నదిలో నిండుగా పారే నీరు ఎంతో చూచాయిగా అవగాహన ఉండాలి. దాదాపు 400 టీఎంసీ నదులలో ఇంకా ప్రవాహం ఉందని తెలిసినప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకుని, పోతిరెడ్డిపాడు లాంటి రెగ్యులేటర్లు, ప్రాజెక్టు కాలువలు లేదా విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా, లేదా రిజర్వాయర్ల స్పిల్ వేస్ నుంచి క్రిందికి ఇంకా కొంతముందే ఖాళీ చేయించాల్సింది. పైరాష్ట్రం మహారాష్ట్రతో మాట్లాడి కర్ణాటక ప్రభుత్వం తన ఆల్మట్టి-నారాయణపూర్ లలో వచ్చిననీటిలోనే దాదాపు 60 టీఎంసీలు పైనుంచి భారీ ప్రవాహం అంచనాలు చూసి క్రిందికి వదిలి ఖాళీ చేశారు. అలాగే అన్ని మన రాష్ట్రాల అధికారులకు ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం, ముందు చూపు ఉండాలి. ఏపీ ముఖ్యమంత్రికి, మంత్రికి ముందే నిపుణులు వివరాలు చెప్పి ఉండాల్సింది. 16వ తేదీ ఉదయం 11 గం. లకు నాగార్జున సాగర్ ఇన్ఫలో-ఔటఫ్లో ఒకసారి సరిచూసుకోవాలి. ఇక గౌ. మంత్రి అనిల్ కుమార్ గారు రెండు మూడు తప్ప మిగిలినవి బాగానే మాట్లాడారు, బొత్స గారి గురించి చెప్పుకోవడం అనవసరం. ఇక కిందవాళ్ళు ఏమి మాట్లాడినా, ఏపీ గౌ. ముఖ్యమంత్రి గారికి కేవలం గౌ. ప్రతిపక్ష నాయకుడి ఇల్లు ముంచడం కోసం ప్రజలను బాధ పెట్టి చెడ్డపేరు తెచ్చుకునే మనస్తత్వం ఉండదు అని నా నమ్మకం/అభిప్రాయం. అలాగే ప్రతిపక్షంలో రోజూ మాట్లాడే ఒక నాయకుడు గారి సంగతి ప్రస్తావించడం అనవసరం కానీ, ఇప్పుడు ఆ ఒక్క ఇల్లు విషయంలో ఉద్యమంలా కాక ముందు ఇతర సహాయ కార్యక్రమాలు, తదుపరి ఖాళీగా ఉన్న ప్రాజెక్టులు నింపడం, లోపాలు ఆ విషయాలపై ఆ ప్రతిపక్షం మాట్లాడాలి, విమర్శించినా.. నిర్మాణాత్మక సూచనలు చేయండి. ప్రభుత్వ నేతలూ ఆ ఇంటి చుట్టూ తిరగటం మాని ప్రజల ఇళ్ల చుట్టూ తిరిగి సమస్యల పరిష్కారం కోసం చూడండి.