ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన మొట్టమొదటి అమెరికా పర్యటనలో భాగంగా ఉత్తర అమెరికా ప్రవాస తెలుగు సమాజం డల్లాస్‌లో శనివారం నాడు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం నాలుగు నుండి అయిదువేల మంది ఉత్సాహవంతమైన కార్యకర్తలు అతిథుల నడుమ విజయవంతంగా జరిగింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. జగన్ ప్రసంగం, దానికి ప్రతినిధుల స్పందన, ఆహారం, భద్రత వంటి అంశాలు నిర్వాహకులు పక్కాగా రూపొందించారు. ఆ క్రమంలో వారి అత్యుత్సాహం వలన బోల్తాపడ్డారు. ఈ సభకు మొత్తం మూడు రంగుల పాసులను ముద్రించారు. తెలుపు(ప్రధాన వేదిక ముందు వరుసలో VIPలకోసం), ఎరుపు(ప్రధాన వేదిక ఎదురుగా రెండో విభాగం), నీలం(పైన గ్యాలరీలో). తెలుపు రంగు కుర్చీలు 150 వేయగా పాసులు మాత్రం 350 పంచిపెట్టారు. జగన్ స్థానిక ప్రవాస ప్రముఖులతో భేటీ కావల్సి ఉండగా అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆయన దాన్ని త్వరగా ముగించుకుని ప్రణాళికలో అనుకున్న దానికన్నా ముందుగానే వచ్చేసరికి సభకు వచ్చిన అతిథులు అనూహ్యంగా ఆయనన్ను చూసేందుకు, కలిసేందుకు ప్రధాన వేదిక వద్దకు ఎగబడ్డారు. ఇక్కడే నిర్వాహకుల అత్యుత్సాహం దెబ్బకొట్టింది. ఇప్పటివరకు అమెరికాలో ఏ తెలుగు కార్యక్రమానికి లేని విధంగా తెలుపు రంగు విభాగం ఎదురుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ చోటు తక్కువగా ఉండటం వలన కాసింత తోపులాట జరిగిన మాట వాస్తవం. సభకు ముందుగానే వచ్చిన జగన్ ప్రధాన వేదిక ఎదురుగా బ్యారికేడ్లకు ఆవలి వైపు సోఫాలో కూర్చోవల్సి ఉండగా ఈ అతిథుల తాకిడికి వేదికపైకి వెళ్లకతప్పలేదు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రేమ్‌సాగరరెడ్డి వంటివారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతిథులు ఆ తెలుపు విభాగం వదిలి తమ స్థానాల్లోకి వెళ్లేందుకు సుముఖత చూపకపోవడంతో పోలీసులు కలగజేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తతంగం చూసిన ముఖ్యమంత్రి మొదటి 20నిముషాలు కూసింత అసహనాన్ని ప్రదర్శించడం కనిపించింది. సభ్యులు సర్దుకున్నాక వేదిక మీద తొలుత 10కుర్చీలు వేసి, తర్వాత నాలుగుకి కుదించి, అందులో ఒకదానిలో అప్పటికే ఆసీనులైన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డిని లేపి వేదికపైన ఒక మూల నిలబెట్టగా ఆయన మెల్లగా అక్కడ నుండి నిష్క్రమించారు. ముందు వరుసలో కూర్చుని ఉన్న అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సైతం ప్రధాన వేదికపైకి వెళ్లేందుకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ భూమన కరుణాకరరెడ్డి జోక్యంతో ఆయన వేదికపైకి వెళ్లగలిగారు. ముఖ్యమంత్రి ఆసీనులైన పిమ్మట సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఆయనను వేదిక పైనే ఒక మూల కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆయన్ను కిందకు దింపగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన కోసం అప్పటికే వేసి ఉంచిన సోఫాను ప్రవాసులు కబ్జా చేసేసరికి ఆయనను కిందకు దింపే అవకాశమే రాలేదు. తెలుపు రంగు విభాగంలో పలు తెలుగు సంఘాలకు 10పాసులు చొప్పున ఇచ్చినప్పటికీ కేవలం అధ్యక్షుడికి మాత్రమే అక్కడ స్థానం దొరకడం సభ నిర్వహణా లోపాలను ఎత్తిచూపింది. సిలికానాంధ్ర ప్రతినిధులు పంచెలు కట్టుకుని వచ్చి ఒకరి ఒళ్లో ఒకరు కూర్చోవడం కొంచెం ఇబ్బందికరంగా పరిగణించవచ్చు.
ఓమ్నీ హోటలుకు ముఖ్యమంత్రి రాక కూడా అత్యంత ఆశ్చర్యకర పరిస్థితుల్లో జరిగింది. ఆయన 2గంటల11నిముషాలకు ప్రత్యేక విమానంలో లవ్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వచ్చి 3గంటలకు హోటలుకు వస్తారని అధికారిక సమాచారం. 3గంటల ప్రాంతంలో ప్రవాసులందరూ పూష్పగుచ్ఛాలతో హోటలు ప్రధాన ద్వారం వద్ద వేచి చూస్తుండగా జగన్ రాలేదు. ఆయన 23వ అంతస్థులోని తన గదికి 3వ అంతస్థులోని ప్రత్యేక లిఫ్ట్ ద్వారా వెళ్లిపోయారని తెలుసుకున్న అతిథులు ఉదయం నుండి తమ ఎదురుచూపులకు అదృష్టం లేదని నిరాశపడ్డారు. అసలు ప్రధాన నిర్వాహకులకే తెలియకుండా ఎంబసీ/CMO వారు 3వ అంతస్థుకు ఆయన కాన్వాయి తీసుకెళ్లి అటు నుండే ఆయన గదికి తరలించడం పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేసింది.
జగన్ ప్రధాన వేదికపైకి 6గంటల నుండి 7:30గంటల ఉంటారనేది ఆయన పర్యటన సారాంశం. కానీ 200S గదిలో ఎప్పుడైతే స్థానిక ప్రముఖులతో సమావేశం అర్ధాంతరంగా రద్దు అయిందో ఆయన సభాస్థలికి 4:45కే చేరుకున్నారు. అప్పుడే తాజాగా సభకు వచ్చిన అతిథుల వలన కూసింత రద్దీ ఏర్పడి జగన్‌కు చిరాకు తెప్పించింది. అయినప్పటికీ 5:15కు తన ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్ ఎక్కడా ఆ ఛాయలు కనపడకుండా అత్యద్భుతంగా తన ప్రసంగాన్ని ఉరకలెత్తించారు. సహజంగా చప్పట్లకు కరువు తీరి ఉండే ప్రవాసులు ఆయన పెద్దచుక్కల వద్ద ఆపిన ప్రతిసారి హర్షధ్వానాలతో ఆయన్ను ఉత్తేజపరిచారు. ఆయన ప్రసంగం 6:05కు ముగిసింది. అంటే రావల్సిన సమయానికి అవగొట్టేసి జగన్ తన కార్యక్రమాన్ని పూర్తి చేసేసుకున్నారు. ఎప్పుడూ చాలా క్లుప్తంగా మాట్లాడే వై.ఎస్. కుటుంబానికి ఆప్తులు డా.ప్రేమ్‌సాగరరెడ్డి ఈ సభను ఏక వ్యాఖ్యానంలో నడిపించడం అత్యంత పెద్ద విడ్డూరం. గంపగుత్తగా అన్ని తెలుగుసంఘాల ప్రతినిధులను ఒకేసారి వేదికపైకి పిలవడం కూడా నిర్వహణ లోపంగా పరిగణించవచ్చు. కెనడా నుండి వచ్చిన 40మంది ప్రతినిధులకు కనీసం జగన్‌తో ఒక చిత్రం తీసుకునే అవకాశం కూడా లభించకపోవడం దురదృష్టకరం.
ఏది ఏమైనప్పటికీ మీడియాకు పాసులు ఎగ్గొట్టి, అధికంగా తెలుపు పాసులు పంచిపెట్టి, అత్యుత్సాహంతో బ్యారికేడ్లు అడ్డంపెట్టి, ప్రముఖులను వేదికపైకి ఒక మూలకు నెట్టి డల్లాస్ సభను నిర్వాహకులు 75% విజయవంతంగా 25% అసంబద్ధంగా నడిపి ముగించారు. అవమానాలు….ఆరాటాలు….అర్ధాంతర నిష్క్రమణల నడుమ జగన్ పర్యటనకు ఆద్యంతం బలాన్ని ఇచ్చింది ఉత్సాహపరిచింది ఆ అమెరికా నలుమూలల నుండి వచ్చిన అతిథులు మాత్రమే — సుందరసుందరి(sundarasundari@aol.com)