Videos

44YrsofUnmatchableRAJINISM

Social Media Stormed In India With 44YrsofUnmatchableRAJINISM

అత్యున్నత శిఖరంపై ఉన్నా సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తి ఆయన. కండక్టర్‌ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగి ఎందరో వ్యక్తులకు స్ఫూర్తిగా నిలిచిన జీవితం ఆయనది. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా, మాతృభూమితోపాటు విదేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో సినీ రంగంలోకి అడుగుపెట్టి నిన్నటితో 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా రజనీ అభిమానులు పలు ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం #44YrsofUnmatchableRAJINISM ట్విట్టర్‌లో దుమ్మురేపుతుంది. రజనీకాంత్‌ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్‌. బెంగళూరుకు చెందిన మరాఠీ కుటుంబంలో డిసెంబర్‌ 12, 1950లో ఆయన జన్మించారు. సాధారణ కుటుంబానికి చెందిన ఆయన కుటుంబ పరిస్థితుల రీత్యా బస్సు కండక్టర్‌గా పనిచేశారు. నాటకాల మీద ఉన్న ఆసక్తితో కండక్టర్‌గా వృతి నిర్వహిస్తూనే పలు పౌరాణిక నాటకాలలో నటించేవారు. ఈ క్రమంలో ఓ రోజు తమిళ ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌ రజనీకాంత్‌ని చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. సహాయ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగానూ కనిపించారు. రజనీకాంత్‌ వెండితెరపై కనిపించిన మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్‌’. ‘16 వయతినిలె’ (తెలుగులో ‘16 ఏళ్ల వయసు’) చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ నటించారు. ఇందులో రజనీ విలన్ పాత్ర పోషించారు. ‘భైరవి’ చిత్రంతో రజనీకాంత్‌ కథానాయకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా నుంచి ఆయన ‘సూపర్‌ స్టార్‌’ అయ్యారు. సినీరంగంలో సేవలు అందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ‘పద్మవిభూషణ్‌’, ‘పద్మభూషణ్‌’ బిరుదులతో సత్కరించింది. తెలుగులోనూ రజనీకాంత్‌కు స్టార్‌డమ్‌ ఉంది. దళపతి, ముత్తు, భాషా, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, శివాజీ, కబాలి, రోబో ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం ఆయన మురుగుదాస్‌ దర్శకత్వంలో దర్బార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రజనీకి జోడిగా నయనతార కనిపించనున్నారు.