Devotional

స్వామివారు పుష్కరిణిలో ఎందుకు ఉంటారు?

The story behind atthi varadar in pushkarini

కాంచీపురం దేవాలయాలకు నిలయం. వందల ఆలయాలు కలిగి ఉన్న ఈ నగరం శివకేశవ ఆలయాలకు కేంద్రంగా భాసిల్లుతోంది. జగన్మాత కామాక్షిమాతగా దర్శనమిస్తోంది. వైకుంఠనాధుడైన శ్రీమహావిష్ణువు చిద్విలాసమూర్తిగా వరదహస్తంతో వరాలనొసిగే వరదరాజ పెరుమాళ్‌ ఆలయం మరోసారి అరుదైన ప్రదర్శనకు వేదికయింది. 40 సంవత్సరాలకు 48 రోజులు మాత్రమే దర్శనమిచ్చే అనంత శయనమూర్తి దివ్యమంగళ విగ్రహం అత్తి వరదర్‌ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఆగస్టు 17 వరకు..
జులై 2న స్వామి వారి విగ్రహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీసి పవళింపు సేవతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆగస్టు 17 వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామిని వీక్షించేందుకు దేశ దేశాల నుంచి వస్తున్న లక్షలాది భక్తులతో కాంచీ భక్తజనక్షేత్రంగా మారింది. వందల ఆలయాలతో నిత్యం దైవస్మరణలో ఉండే ఈ మహాక్షేత్రంలో అనంతపద్మనాభుని దర్శనం ఎంతో పుణ్యం.

అత్తిచెట్టుతో విగ్రహం.
శ్రీ అత్తి వరదరాజస్వామి విగ్రహం 9 అడుగుల వరకు ఉంటుంది.సృష్టికర్త బ్రహ్మ దేవశిల్పి విశ్వకర్మతో విగ్రహాన్ని తయారుచేయించి పూజించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యయుగాల్లో దాడుల కారణంగా స్వామి విగ్రహాన్ని జాగ్రత్తగా వెండిపెట్టెలో అమర్చి పుష్కరిణిలో దాచిపెట్టారు. అనంతరం దివ్యమూర్తి శిల్పాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఆ వైకుంఠనాధుడు అగ్ని నుంచి అత్తివరదరాజస్వామిగా అవతరించారు. అందుకే బ్రహ్మదేవుడు ఆయన విగ్రహాన్ని చెక్కించారు.

1939, 1979, 2019..
గతంలో 1939, 1979 సంవత్సరాల్లో ఈ మహాక్రతువును నిర్వహించారు. తాజాగా కొత్త శతాబ్దంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఆన్‌లైన్‌లోనూ దర్శనం బుక్‌ చేసుకోవచ్చు..
ఆగస్టు 17 వరకు శ్రీలక్ష్మీపతిని దర్శించుకునే అవకాశముంది. ఆన్‌లైన్‌లో తగు రుసుము చెల్లించి దర్శనం బుక్‌ చేసుకునే అవకాశాన్ని ఆలయవర్గాలు కల్పించాయి.

మూడోసారి స్వామివారిని దర్శించుకున్న రాజమ్మాళ్‌
వరదరాజ పెరుమాళ్‌ ఆలయ ధర్మకర్త తాతాచార్యుల కుటుంబానికి చెందిన 101 సంవత్సరాల వృద్ధురాలు రాజమ్మాళ్‌ గురువారం రాత్రి అత్తివరదర్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1939, 1979లో రెండుసార్లు అత్తివరదర్‌ను దర్శించుకున్నానని, ప్రస్తుతం మూడోసారి స్వామివారిని దర్శించుకోవడం మహాభాగ్యం భావిస్తున్నానన్నారు. చిన్న వయస్సులో చూసిన స్వామి రూపం ఇప్పటికీ అలాగే ఉందన్నారు.