నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం విషయంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ అదృశ్యమై నేటికి 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీదీ ఆయనను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైహోకు విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన నేతాజీ అదశ్యమయ్యారు. అప్పట్నుంచి ఆయనకేమైందన్నది ఇదమిత్థంగా తెలియరాలేదు. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది’’ అని బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై నేటికీ స్పష్టమైన ఆధారాల్లేవు. తైవాన్ నుంచి బయల్దేరి విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని పలు నివేదికలు చెబుతున్నా.. వాటిలో ఎంత వరకు వాస్తవముందన్నది తెలియలేదు. ఆయన అదృశ్యంపై ఎప్పటికప్పుడు కేంద్రం పలు కమిటీలు నియమించినా ఫలితం శూన్యం. 1956లో షా నవాజ్ కమిటీ, 1970లో కోస్లా కమిషన్, 2005లో ముఖర్జీ కమిషన్ వేసినా అవేవీ అసలు విషయాన్ని నిగ్గుతేల్చలేకపోయాయి. చివరిగా 2016 సెప్టెంబర్ 1న జపాన్‌కు చెందిన పలు నివేదికలు ఆయన విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడించినా.. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నారని, అజ్ఞాతంలో ఉన్నారని పలువురు విశ్వసిస్తుండడం గమనార్హం.
నేతాజీకి ఏమి జరిగిందో ప్రజలకు తెలియాలి
Related tags :