చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కే.శివన్ ప్రయోగ వివరాలను ప్రజలకు వివరించారు. ఇక నుంచి జరగబోయే అన్ని ప్రక్రియల్ని సాంకేతిక అంశాలతో సహా వివరించారు. ‘‘ ఈరోజు చంద్రయాన్-2లో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సిన విన్యాసం ఉదయం 9గంటలకు ప్రారంభమై 30 నిమిషాలు పాటు సాగింది. చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి చేరాలంటే ఓ కచ్చితమైన కక్ష్యలోకి వ్యోమనౌకను చేర్చాల్సి ఉంటుంది. దానికి ఉపగ్రహాన్ని 90డిగ్రీలు మళ్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 88 డిగ్రీల ఇంక్లినేషన్‌తో చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి కక్ష్యను మార్చాల్సి ఉంటుంది. అప్పుడు 90 డిగ్రీల ఇంక్లినేషన్‌కి చేరుకుంటుంది. జులై 22న ప్రయోగించిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 5 విన్యాసాలు చేపట్టాం. అందులో ఆగస్టు 14న చేపట్టిన ట్రాన్స్ ల్యూనార్ ప్రక్రియ అత్యంత కీలకమైనది. ఇప్పటి వరకు చంద్రయాన్-2లోని వ్యవస్థలన్నింటి పనితీరు సజావుగా సాగుతోంది.’’ అని శివన్ మీడియా ద్వారా ప్రజలకు వివరించారు.ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-2 జాబిల్లి ఉపరితలానికి చేరుకునే క్రమంలో చేసే ప్రయోగాలను శివన్ సాంకేతిక అంశాల ఆధారంగా వివరించే ప్రయత్నం చేశారు. ‘‘ మరో నాలుగు విన్యాసాల ద్వారా చంద్రయాన్-2 కక్ష్యలను తగ్గిస్తూ వస్తాం. సెప్టెంబరు 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుంది. ల్యాండర్‌లో వ్యవస్థలన్నింటిని సిద్ధం చేసేలా సెప్టెంబరు 3న మూడు సెకన్ల పాటు మరో విన్యాసం చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4న మరో 6సెకన్ల పాటు ల్యాండర్‌పై మరో విన్యాసం ఉంటుంది. అక్కడి నుంచి మూడు రోజుల పాటు వ్యవస్థలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తాం. ఇక సెప్టెంబరు 7న వేకువజామున 1.40గంటలకు ల్యాండర్‌లో ప్రొపల్షన్ ప్రారంభమై 1.55గంటలకు ల్యాండ్ అవుతుంది. అనంతరం రెండు గంటల తర్వాత ల్యాండర్‌లోని ర్యాంప్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుంది. 3.10గంటలకు సోలార్ ప్యానెళ్లు తెరచుకుంటాయి. సరిగ్గా 4గంటల ప్రాంతంలో రోవర్ జాబిల్లి ఉపరితలానికి చేరకుని మిషన్‌ని ప్రారంభిస్తుంది. చంద్రుడి ఆవిర్భావం సహా అక్కడి వాతావరణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేపడుతుంది’’ అని శివన్ ప్రయోగ వివరాలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
సెప్టెంబరు 7న ల్యాండింగ్
Related tags :