ScienceAndTech

ఇక నగదు కోసం ఏటీఎంకు వెళ్లనవసరంలేదు

Yono Cash Will Erase The Need To Go To An ATM

పర్సులో డబ్బుల్లేకపోయినా ఏటీఎం కార్డు వుంటే చాలనుకునే రోజులు పోయాయి. డిజిటల్ మాయాజాలం. దాన్ని తలదన్నే మరో కొత్త ఫీచర్ యోనో క్యాష్. ఇప్పటికే వచ్చి ఉన్నా దీని పట్ల ప్రజల్లో అవగాహన తక్కువ. తాజాగా ఎస్‌బీఐ కూడా యోనో క్యాష్ పేరుతో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. యోనో క్యాష్ గురించి అవగాహన పెరిగితే ఏటీఎం కార్డు అవసరం ఉండదు. డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించి ఏటీఎం కార్డుల్ని పూర్తిగా తొలగించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లే యోనో క్యాష్ పాయింట్స్‌గా పనిచేస్తాయి. ఇప్పటికే 68,000 యోనో క్యాష్ పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది ఎస్‌బీఐ. మరో 18 నెలల్లో 10 లక్షల యోనో క్యాష్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇంతకీ యోనో క్యాష్‌లో డబ్బులు ఎలా వస్తాయంటే.. కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్ ఉంటే చాలు. డబ్బులు డ్రా చేసేయొచ్చు. షాపింగ్ కూడా దీనితోనే చేసేయొచ్చు.ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తరువాత రిక్వెస్ట్ యోనో క్యాష్‌పై క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్ సెలక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. మీకు దగ్గర్లో ఉండే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌నే ఏటీఎంలో ఎంటర్ చేయాలి. యాప్‌లో క్రియేట్ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇలా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం.