‘‘తమిళంలో పాతిక సినిమాలు చేశా. కన్నడ, హిందీ భాషల్లోనూ నటించా. తెలుగులో ఓ మంచి పాత్రతో అడుగుపెట్టాలనుకున్నాను. ఆ కోరిక ఈ చిత్రంతో తీరింద’’న్నారు ఐశ్వర్య రాజేష్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. శుక్రవారం విడుదల కానుంది. గురువారం ఐశ్వర్య రాజేష్ హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడింది.
‘‘క్రాంతిమాధవ్, విజయ్ దేవరకొండ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నిజానికి అదే నా తొలి చిత్రం. ఆ సినిమా సెట్లో నిర్మాత కె.ఎస్.రామారావుకి ‘కణ’ ట్రైలర్ చూపించా. ఆయనకు నచ్చి రీమేక్ హక్కుల్ని తీసుకున్నారు. ‘కణ’లో క్రికెటర్‌గా నటించిన నన్నే నాయికగా తీసుకున్నారు. తమిళంలో నాకు మంచి పేరు తీసుకొచ్చిన అదే పాత్రని తెలుగులోనూ పోషించడం ఆనందంగా అనిపించింది’’.
* ‘‘చిన్నప్పుడు రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’లో ఓ పాటలో నటించా. మా నాన్నగారికి మంచి స్నేహితుడాయన. ఈ చిత్రంలో తనతో పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారితో పనిచేస్తున్నట్టే అనిపించింది. ఈ చిత్రంలో ఆఫ్ స్పిన్నర్‌గా నటించా. కోచ్‌ల దగ్గర 75 రోజులు శిక్షణ తీసుకుని క్రికెట్ నేర్చుకున్నా. ‘కణ’ కోసం తీసుకున్న శిక్షణ ఈ సినిమాకి ఉపయోగపడింది’’.
* ‘‘ఓ తమిళ చిత్రంలో డెబ్భై ఏళ్ల ముసలమ్మలా, మరో హిందీ చిత్రంలో అరవై ఏళ్ల బామ్మలా కనిపించా. తెలుగులోనూ వైవిధ్యమైన పాత్రలొస్తే నటించడానికి సిద్ధమే’’.
ముసలిదానిలా
Related tags :