Health

జుట్టు ఒత్తుగా పెరగాలంటే….

Here are the list of foods to get strong long hair

జుట్టు పొడుగ్గా పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని మనమంతా కోరుకుంటాం. అందుకోసం షాంపూలు మార్చడం, క్రీములు వాడటం, స్పా చికిత్సలు తీసుకోవడం వంటి ఎన్నో పనులు చేస్తాం. అందుకు అవసరమైన పోషకాహారం తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తాం. ఈ సూపర్‌ఫుడ్స్‌ని మీ డైట్‌లో భాగం చేసుకుని చూడండి. చాలా తక్కువ సమయంలోనే మీరు కోరుకున్న మార్పు కనిపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ లోపం వల్ల జుట్టు రాలడం, చిట్లడం, ఇతరత్రా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే… ఇవి రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.

పాలకూర: దీనిలోని ఫోలేట్‌, ఇనుము, విటమిన్‌ ఏ, సి పోషకాలు జుట్టు ఎదుగుదలలో కీలకంగా పనిచేస్తాయి. చర్మగ్రంథులు సెబమ్‌ ఉత్పత్తి చేసేందుకు విటమిన్‌ ఏ తోడ్పడుతుంది. ఇది మాడు, జుట్టుని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఒకకప్పు పాలకూర తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్‌ ఏ దాదాపు యాభై నాలుగుశాతం వరకూ అందుతుంది. దీనిలో ఎక్కువగా ఉండే ఇనుము పోషకం వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నట్స్‌: రుచిగా ఉండే నట్స్‌లో జుట్టుని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో కీలక పోషకాలు అధికమోతాదులో లభిస్తాయి. వాటిల్లో విటమిన్‌ బి, జింక్‌, ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి. గుండెవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఉదాహరణకు గుప్పెడు బాదం గింజల్ని నానబెట్టుకుని తినగలిగితే రోజులో అవసరమైన విటమిన్‌ ఇ మోతాదులో ముప్ఫై ఏడు శాతం శరీరానికి అందినట్లే. అలానే పొద్దుతిరుగుడు గింజల్ని రోజూ తినగలిగితే శరీరానికి కావలసిన విటమిన్‌ ఇ సగానికిపైగా లభిస్తుంది. అవిసెగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు సాయపడేవే.

గుడ్లు: వీటిల్లో మాంసకృత్తులు, బయోటిన్‌ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. సాధారణంగా హెయిర్‌ ఫాలికల్స్‌ ప్రొటీన్‌తో నిండి ఉంటాయి. ఈ పోషకం లోపించినప్పుడు జుట్టు రాలే సమస్య మొదలువుతుంది. బయోటిన్‌ జుట్టు ఎదుగుదలకు కీలకంగా పనిచేసే కెరొటిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి రెండూ లోపించకుండా చూసుకుంటే చాలు. మీ సమస్య అదుపులో ఉంటుంది. గుడ్లలో జింక్‌, సెలీనియం వంటి ఇతర పోషకాలూ ఎక్కువే. అందుకే గుడ్డుని క్రమం తప్పకుండా తింటే ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

చిలగడ దుంపలు: వీటిల్లో బీటాకెరటిన్‌ ఎక్కువ. దీన్ని శరీరం విటమిన్‌ ఏ గా మార్చుకోగలదు. సెబమ్‌ ఉత్పత్తిలో కీలకంగా పనిచేసి జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.

బీన్స్‌: వీటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏది తీసుకున్నా పోషకాలు పుష్కలంగా మనశరీరానికి అందుతాయి. ప్రొటీన్‌లోపంతో బాధపడే శాకాహారులు బీన్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటే మేలు. ఇందులో జుట్టుకి మేలు చేసే జింక్‌ ఎక్కువగా లభిస్తుంది. సోయా బీన్స్‌లో ఉండే స్పెర్మిడైన్‌ కుదుళ్లను బలంగా మారుస్తుంది.

క్యాప్సికం: దీనిలో విటమిన్‌ సి ఎక్కువ. ఒక కమలాఫలం నుంచి అందే విటమిన్‌ సితో పోలిస్తే… పసుపురంగు క్యాప్సికం నుంచి ఐదు రెట్లు అందుతుందట. అలానే దీనిలోని యాంటీఆసిడ్లు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

మన జుట్టు ప్రతి నెలా సుమారు 0.5 ఇంచులు ఎదుగుతుందట. అయితే అది ఎంత వేగంగా పెరుగుతుంది అనేది వయసు, ఆరోగ్యం, జన్యువులు, తీసుకునే ఆహారం… ఇలా వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. పోషకాలు అందేలా జాగ్రత్త పడాలి.