Health

వర్షాకాలం ఇన్ఫెక్షన్లకు విరుగుడు….

Fight Rainy Season Infections With This Mint Coating

వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు… బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన ఇంట్లో లభించే పదార్థాలతో ఆ సమస్యల్ని ఎలా అధిగమించొచ్చో చూద్దామా…
వర్షపు నీటిలో ఎక్కువ సమయం ఉంటే కాలి వేళ్లకు దురద, ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు గోరింటాకు పొడిలో గులాబీ నీరు కలిపి సమస్య ఉన్న చోట రాసుకుంటే ప్రతిఫలం కనిపిస్తుంది.
* పావుకప్పు పసుపులో సరిపడా గులాబీ నీరు కలిపి ముద్దలా తయారు చేసుకోవాలి. దీన్ని పాదాలకు రాసుకొని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలతో క్రిములు నశించడంతో పాటు పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. శుభ్రం చేసుకున్న తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే… కొద్దిగా ముల్తానీమట్టి కలపొచ్చు.
* ముల్తానీ మట్టి, వేపపొడి, లావెండర్‌ నూనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీన్ని పాదాలకు పట్టించి అరగంట తరువాత కడిగేస్తే చాలు. పాదాల్లో రక్త ప్రసరణ పెరగటంతో పాటు క్రిములూ నశిస్తాయి. ఈ పూత వేసుకున్నాక…. ఆలివ్‌ నూనెతో కొన్ని నిమిషాలు మర్దన చేసుకోవాలి.
* ఈ కాలంలో పుదీనాతో తయారు చేసిన క్రీమ్‌లు, స్క్రబ్‌లతో పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కప్పు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించాలి. కాస్త చల్లారిన తరువాత పుదీనా ఆకులతో పాదాల్ని రుద్దుకోవాలి. ఇందులో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వర్షపు నీటిలో తడిసినప్పుడు వచ్చే పాదాల దుర్వాసనను దూరం చేస్తాయి.