Politics

రాజధానిగా అమరావతి కొనసాగనివ్వబోనని జగన్ తెలిపారు

Jagan Informed Modi That He Wont Let Amaravathi To Be The Capital

రాజధానిగా అమరావతిని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్‌ చెప్పారని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే యోచనలో జగన్‌ ఉన్నట్లు టీజీ తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన చేసే పనిని ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌ చేయాలని గతంలో అడిగామని టీజీ గుర్తు చేశారు. అమరావతి మీదే దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో తెదేపా సహా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా ఓడిపోయారని టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. గోదావరి నీళ్లను శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదమని చెప్పారు. మరోవైపు తెలంగాణ సీఎంపైనా టీజీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌తో ఎవరు కలిసినా నాశనం తప్పదని వ్యాఖ్యానించారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ విడిపోవడం ఖాయమన్నారు. పెట్టుబడుల వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభిస్తే.. చంద్రబాబు దాన్ని కొనిసాగించారని టీజీ చెప్పారు.