మన్యం గ్రామాల ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. సకాలంలో వైద్యమందక రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి కొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోయిన ఓ మాతృమూర్తి శిశువుతో సహా అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం జమదంగిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం కొండ ప్రాంతాల్లో 20 కి.మీ నడిచి వెళ్లిన లక్ష్మి (28) అనే నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం జమదంగి నుంచి జి.మాడుగుల మండలం బొయితిలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన మహిళ..చికిత్స అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమైంది. మార్గమధ్యలో నొప్పులు రావడంతో బంధువులు డోలీలో ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబ వివరాలను అడిగి తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించక పోవడం గమనార్హం.
మన్యంలో మరో అమానుష కాండ
Related tags :