DailyDose

నేటి ప్రధాన వార్తలు-08/25

Top Breaking News In Telugu Today - Aug 25th 2019

1. నిర్లక్ష్యంతోనే చంపేస్తున్నారు

సామర్థ్యానికి మించి అధికలోడుతో వెళ్తున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీనివల్ల అమాయక ప్రాణాలు బలవుతున్నాయని తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ప్రయాణించే వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు కఠిన శిక్షలు విధిస్తే వాహన యజమానుల్లో భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది.

2. ఇంట్లోనే తడి చెత్తను ఎరువుగా మార్చే యూనిట్లు

హైదరాబాద్‌లో ఇళ్లలోనే తడి చెత్తను ఎరువుగా మార్చే యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చుకోవడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందిస్తున్న గృహాలకు పచ్చ (గ్రీన్‌) రేటింగ్‌ ఇస్తారు. అలాంటి వారికి పన్ను రాయితీల వంటివి ఇవ్వాలని, కొత్త విధానాన్ని అనుసరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ దానకిషోర్‌ నిర్ణయానికొచ్చారు.

3. రంగంలోకి విజి‘లెన్స్‌’

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలో పేర్కొన్న అంశాలపై విజిలెన్సుశాఖ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు తమకు అవసరమైన రికార్డులు సమర్పించవలసిందిగా రాజమహేంద్రవరం ప్రాంతీయ విజిలెన్సు అధికారి పోలవరం ఉన్నతాధికారులను కోరారు. శనివారం వరకూ గడువు విధించారు. దీంతో జలవనరులశాఖ అధికారులు శనివారం విజిలెన్సు అధికారులను కలిసి ఇందుకు మరికొంత సమయం అవసరమవుతుందని వివరించారు.

4. తెలుగు వికీపీడియా బలోపేతానికి ఐఐఐటీ శ్రీకారం

తెలుగు భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషనల్‌ టెక్నాలజీ(ఐఐఐటీ)-హైదరాబాద్‌ శ్రీకారం చుట్టింది. అరకొరగా ఉన్న తెలుగు వికీపీడియాను బలోపేతం చేసే మహాక్రతువును చేపట్టింది. దీనికి కేంద్ర సమాచార సాంకేతికశాఖ ఆమోదం లభించగా.. తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.

5. పీఎం కిసాన్‌ సొమ్ము!

రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద ఇస్తున్న మొత్తంలో కొంత సొమ్మును వారి కోసం ఉద్దేశించిన పింఛను పథకానికి ప్రీమియంగా మళ్లించుకోనుంది. ఇందుకోసం రైతులు బ్యాంకులో అంగీకార పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద ఇస్తున్న సాయాన్ని ‘ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌-ధన్‌ యోజన’ (పీఎం కేఎంవై)కు మళ్లించుకుంటామని.. పీఎంకిసాన్‌లో లబ్ధి పొందిన రైతులందరినీ పీఎంకేఎంవైలో చేరేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు సూచించింది.

6. చెన్నైలో ‘సాహో’ తమిళపాట విడుదల.

7. ఈక్విటీలు, డెరివేటివ్‌ లాభాలపై సర్‌ఛార్జీ ఉండదు

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) అటు ఈక్విటీ, ఇటు డెరివేటివ్స్‌ విభాగాలపై పొందే మూలధన లాభాలపై విధించిన అదనపు సర్‌ఛార్జీని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడం కోసం శుక్రవారం కేంద్రం పలు చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బడ్జెట్‌లో విదేశీ, దేశీయ ఈక్విటీ మదుపర్లపై విధించిన ‘సూపర్‌ రిచ్‌’ పన్నును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, శనివారం దీనిపై ఒక అధికారిక ప్రకటనలో స్పష్టతనిచ్చారు.

8. తీరంలో హై అలర్ట్‌ ప్రకటించిన భారత నేవీ!

తీరప్రాంతాల్లో భారత నౌకాదళం అత్యంత అప్రమత్తత (హైఅలర్ట్‌)ను ప్రకటించింది. లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ)కు చెందినట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు తమిళనాడులోకి చొరబడ్డారన్న నిఘావర్గాల సమాచారంతో ఈ చర్య చేపట్టింది. రక్షణశాఖ ప్రతినిధి ఒకరు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

9. అంతరిక్షంలో తొలి నేరం!

అంతరిక్షంలో జరిగిన మొదటి నేరాన్ని అమెరికా రోదసి సంస్థ నాసా శోధిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉండగా మహిళా వ్యోమగామి ఆన్‌ మెక్‌క్లెయిన్‌ తన మాజీ భర్త బ్యాంకు ఖాతాలోకి అక్రమంగా చొరబడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తోంది. ఖాతాలోకి ప్రవేశించిన మాట నిజమేనని మెక్‌క్లెయిన్‌ అంగీకరించారు. అయితే ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పారు.

10. మూడోసారి.. పసిడి గురి

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అనగానే పతాక స్థాయి ఆటతో చెలరేగిపోయే ఆమె.. టోర్నీలో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో చెన్‌ యూ ఫీని వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. మరోవైపు తొలి టెస్టులో కోహ్లీసేన భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది