NRI-NRT

డెట్రాయిట్‌లో ఘనంగా 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలు

7th Telugu Matlata Competitions Held By Silicon Andhra In Detroit-డెట్రాయిట్‌లో ఘనంగా 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలు

“పలుకే బంగారం – పదమే సింగారం” అన్న నినాదంతో సిలికానాంధ్ర మనబడి ఈ వారాంతం డెట్రాయిట్ లో ఏడవ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలను నిర్వహించింది. పోటీలు రెండు వయోవిభాగాల్లో నిర్వహించారు. ఒక్కొక్క పోటీలో మొదటి బహుమతి $1116, రెండవ బహుమతి $751 చొప్పున మొత్తం ఎనిమిది మంది పిల్లలు బహుమతులు గెల్చుకున్నారు. దేశవిదేశాల్లో పలునగరాలలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలలో 800+ మంది ప్రాంతీయ పోటీలలో తలపడి, అందులో నెగ్గిన 50+ మంది ఈ తుది పోటీలలో డెట్రాయిట్ కు వచ్చి పాల్గొన్నారు.

“తిరకాటం” అన్న తెలుగు ప్రశ్నలు జవాబుల క్విజ్ పోటీలో విద్యార్థులు తెలుగు సాహిత్యం, కళలు, జాతీయాలు, సామెతలు , తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు లాంటి అనేక విభాగాల్లో దాదాపు 200 ప్రశ్నలకి అవలీలగా జవాబులు చెప్పి తమ ప్రతిభను ప్రదర్శించారు. “పదరంగం” అనే తెలుగు పదాలను విని రాసే పోటీలో “కులిశకర్కశదేహులు”, “ప్రాక్స్రోతస్సు”, “తార్క్ష్యము” లాంటి క్లిష్టమైన పదాలను విద్యార్థులు ఏ మాత్రం తడబాటు లేకుండా లిఖించి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచారు. ఏడు సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ పోటీలలో కొందరు విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే మొదటి బహుమతి పొందారు.

చిల్లా శ్రీలక్మి, ఇంద్రగంటి పద్మ, పలిగారం దుశ్యంత నాయుడు, రాచకొండ చంద్రశేఖర్, కలిదిండి రవిరాజు, కొల్లు యోగేష్, యార్లగడ్డ రాం ప్రసాద్, సిద్దు షేక్, తాడిమళ్ల రఘురాం, వేణు శ్రీదాస్యం, రావు గంధం, కవుతరపు సుధ , నెక్కంటి మాధవి , దేవబత్తిని హరి, కంచర్ల సురేష్ , పూర్వ సంచాలకులు నిడమర్తి శ్రీనివాస్ , సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యక్షులు: రాయవరం భాస్కర్, కస్తూరి గౌతమ్ ల సహకారంతో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించారు.

భవిష్యత్తులో తెలుగు సాంకేతికతని మరింతగా ఉపయోగించి మరింతమంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా చేయడం తమ బృందం లక్ష్యమని తెలుగు మాట్లాట సంచాలకులు శ్రీనివాస్ తొంటా, మనబడి ఉపాధ్యక్షులు తోటపల్లి ధనుంజయ్‌లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు maatlaata@manabadi.siliconandhra.orgకు ఈమెయిలు లేదా 248-470-7163కి వాట్సాప్ చేయవచ్చు.

*** ‭విజేతలు:
*** బుడతలు (5-9 ఏళ్ల పిల్లలు):
పదరంగం: 1. పారుపూడి సాన్వి (Saanvi Parupudi) 2. ఆలిబిల్లి అవనీష్ (Avaneesh Alibilli).
తిరకాటం: 1. బోదనపు వేదశ్రీ (Vedasri Bodanapu ) 2. మాల్యవంతం అనిక (Anika Malyavanatham)

*** సిసింద్రీలు (10-14 ఏళ్ల పిల్లలు):
పదరంగం: 1. జవ్వాది ఆయుష్ (Ayush Javvadi) 2. కొణతాలపల్లి తరుణి (Tharuni Konatalapalli)
తిరకాటం: 1. దోసిభట్ల రామ్ (Ram Dosibhatla) 2. నెరయనూరి లాస్య (Lasya Nerayanuri)