మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఉన్నతంగా జీవితం.. ఐఐటీలో చదివే ప్రతి విద్యార్థి ఎంచుకునే కెరీర్ ఇది. కానీ అవన్నీ కాదనుకుని ప్రభుత్వ ఉద్యోగంలోని అతి తక్కువ స్థాయి విభాగంలో చేరాడో యువకుడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో చదివి ఇప్పుడు రైల్వేలో ట్రాక్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ కొలువంటే తనకెంతో ఇష్టమని చెబుతున్న ఆ యువకుడి పేరు శ్రవణ్ కుమార్. బిహార్ రాజధాని పట్నాకు చెందిన శ్రవణ్ కుమార్ 2010లో ఐఐటీ బాంబేలో చేరాడు. ఈ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఎంటెక్ పట్టా పొందాడు. అయితే ముందు నుంచీ ప్రభుత్వ ఉద్యోగి కావాలన్న ఆసక్తితో చదువు పూర్తవగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. తనతో పాటు చదువుకున్న ఐఐటీ స్నేహితులు పేరున్న కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా.. అతడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన గ్రూప్ డీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ట్రాక్ మెయింటెనర్(ట్రాక్‌మన్)గా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం ధన్‌బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని చంద్రపురాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగ భద్రత ఉంటుందనే కారణంతోనే తాను రైల్వేల్లో చేరినట్లు శ్రవణ్ చెబుతున్నాడు. అతడి గురించి తెలిసి తోటి సీనియర్ ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ రంగంలో ఉన్నతస్థాయి అధికారి అవుతానని శ్రవణ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఐఐటీ బాంబే నుండి డిగ్రీ. చేసేది రైల్వే పట్టాల తనిఖీ.
Related tags :