నేను ఏడు నెలల గర్భిణిని. మొదట్నుంచీ ఛాతీలో మంటగా ఉంటోంది. మందులు వేసుకుంటున్నా పూర్తిగా తగ్గటం లేదు. దీనికి కారణమేంటి? ఆహారపరంగా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
మీలాగే గర్భిణుల్లో చాలామంది ఛాతీలో మంటతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా రెండో, మూడో త్రైమాసికంలో ఇది మరింత ఎక్కువగానూ ఉంటుంది. దీనికి మూలం గర్భిణుల్లో ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావటం. దీని వల్ల పేగుల కదలికలు తగ్గుతాయి. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట ఉండే కండర వలయం (స్ఫింక్టర్) బిగువు తగ్గుతుంది. దీంతో జీర్ణాశయంలోని పదార్థాలు పైకి ఎగదన్నుకొని వస్తుంటాయి (రిఫ్లక్స్). మరోవైపు గర్భసంచి బరువు పెరగటం వల్ల జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. ఫలితంగా ఆహారం జీర్ణమయ్యే క్రమంలో విడుదలయ్యే ఆమ్లాలు, వెలువడే వాయువులు పైకి వచ్చేస్తుంటాయి. అజీర్ణం, పులితేన్పులు, ఛాతీలో మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. గర్భిణుల్లో తరచుగా చూసే సమస్యే ఇది. దీని గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. మరీ అవసరమైతేనే మందులు వాడుకోవాలి. ఎందుకంటే ఛాతీలో మంటను తగ్గించే యాంటాసిడ్ మందులను అదేపనిగా ఎక్కువకాలం తీసుకుంటే శరీరం క్యాల్షియం, ఐరన్‌ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతుంది. గర్భిణులకు క్యాల్షియం, ఐరన్ అత్యవసరమనే విషయాన్ని మరవరాదు. మందుల కన్నా కూడా ఆహార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవటం మేలు. ముఖ్యంగా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తింటే కడుపు బాగా నిండినట్టయ్యి.. పదార్థాలు పైకి ఎగదన్నుకొచ్చి ఛాతీలో మంట తలెత్తొచ్చు. తక్కువ తక్కువగా, రోజుకు ఆరేడుసార్లు తింటే ఆహారం జీర్ణాశయంలోనే జీర్ణమవుతుంది. కడుపు తేలికగా ఉంటుంది. ఉదయం తీసుకునే అల్పాహారం నుంచే జాగ్రత్తలు పాటించాలి. కాస్త చప్పగా ఉండే చపాతీ, అటుకులు, చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు, మరమరాల ఉప్మా వంటివి వెంటనే ఆమ్లం ఉత్పత్తి కాకుండా చూస్తూ.. వికారం, ఛాతీలో మంట రాకుండా చేస్తాయి. తేలికగా జీర్ణమవుతూ కడుపులో హాయి భావన కలగజేస్తాయి. పుల్లగా ఉండే నిమ్మ, నిమ్మజాతి పండ్లు, కాయగూరలను నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో కలిపి తినటం మంచిది. ఉదాహరణకు పండ్ల రసాల్లో నీళ్లు, చక్కెర కలుపుకోవచ్చు. పుల్లటి పెరుగు కన్నా తాజా పెరుగు తీసుకోవాలి. బాగా పులిసిన పిండికి బదులు తాజా పిండితో చేసే దోసెలు తినటం మంచిది. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, ఘాటు వాసనలతో కూడిన మసాలా వంటకాలు సైతం ఛాతీలో మంటకు దారితీయొచ్చు. వీటి విషయంలో పరిమితి పాటించాలి.
పీచు పదార్థం తగినంతగా తీసుకుంటే పేగుల కదలికలు మెరుగవుతాయి. దీంతో మలబద్ధకం, ఛాతీ మంటను నివారించుకోవచ్చు. నమిలి తినగలిగే పదార్థాలు తీసుకోవటమూ బాగా ఉపయోగపడుతుంది. భోజనం చేసేటప్పుడు, చేసిన తర్వాత నిటారుగా కూర్చోవాలి. భోజనం చేసే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగకూడదు. భోజనానికీ భోజనానికీ మధ్యలో తరచుగా నీళ్లు తాగితే ఆమ్ల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఆకలి వేస్తున్నట్టు అనిపించగానే భోజనం చేయటం ఉత్తమం. ఆకలి వేస్తున్నా తినకుండా ఎక్కువసేపు అలాగే ఉండిపోతే ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఛాతీ మంటకు దారితీస్తుంది. తిన్న వెంటనే కాకుండా ఒకట్రెండు గంటల తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మందులతో పనిలేకుండానే ఛాతీలో మంటను తగ్గించుకోవచ్చు.