ఆశా వర్కర్లను ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా అంటూ దుయ్యబట్టారు. ఆశా వర్కర్లకు రూ.10 వేల జీతం పెంచేశాం అంటూ ఫొటోలకు పోజులిచ్చి.. మరో పక్క ఏకంగా ఉద్యోగాల్లోంచి తీసేలా జీవో ఇచ్చారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆశా కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు ట్విటర్‌లో స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆశా కార్యకర్తల కష్టానికి గ్రేడులేంటని ప్రశ్నించారు. చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారంటూ చంద్రబాబు ఆక్షేపించారు. ‘‘ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా? ఇది వాళ్లను వేధించడానికే. ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.10 వేల జీతం ఎలాంటి షరతులూ లేకుండా ఇవ్వాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులంటూ ఏదో ఒక మార్ఫింగ్ కథను వైకాపా నేతలు సృష్టిస్తారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలోకి వచ్చినా వారికి అది మామూలే అంటూ మండిపడ్డారు.
ఆశావర్కర్లను మోసగిస్తున్న ప్రభుత్వం
Related tags :