పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది కొత్త సంగతేమీ కాదు. మరి ఇవి కాలేయ క్యాన్సర్ నివారణకూ తోడ్పడతాయన్న సంగతి తెలుసా? రోజుకు 7 గ్రాములు, అంతకన్నా తక్కువగా పొట్టుతీయని ధాన్యాలు తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు 33 గ్రాములు లేదా రెండు సార్లు పొట్టుతీయని ధాన్యాలు తినేవారికి కాలేయ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సుమారు 24 సంవత్సరాల పాటు 1.25 లక్షల మందిని పరిశీలించి మరీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదనంగా తీసుకునే ప్రతి 12 గ్రాముల ధాన్యాలకు కాలేయ క్యాన్సర్ ముప్పు 16% వరకు తగ్గుముఖం పడుతుండటం విశేషం. పొట్టుతీయని ధాన్యాల్లోని పీచు ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో ఇన్సులిన్ స్థాయులు, ఒంట్లో వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా కాలేయ క్యాన్సర్ ముప్పూ తగ్గుతుందన్నమాట. ఊబకాయం, మధుమేహం, దీర్ఘకాల హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అతిగా మద్యం తాగటం, పొగ అలవాటు వంటివన్నీ కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. పీచు పదార్థం తగ్గటమూ కాలేయ క్యాన్సర్ ముప్పును తెచ్చిపెట్టొచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అందువల్ల దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమలు, చిరుధాన్యాలు, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవటం మంచిది.
పొట్టుతో సహా మింగేయండి
Related tags :