ఓ శాస్త్రవేత్త… అణుబాంబు తయారుచేశాడు… దాని ఫలితాల్ని చూసి చలించిపోయాడు… అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు… ఆయనెవరో, ఆ సంగతులేంటో తెలుసుకుందామా?
అది రెండో ప్రపంచ యుద్ధకాలం. జర్మన్ నియంత హిట్లర్ అణుబాంబును తయారుచేస్తాడేమోనని అమెరికా అనుమానించింది. ఆయన కన్నా ముందే దాన్ని ఒక హెచ్చరికగా రూపొందించాలనుకుంది. ‘మన్హటన్’ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దానికి డైరెక్టరుగా అప్పటికే శాస్త్ర రంగంలో మేధావిగా గుర్తించిన ఒక యువ శాస్త్రవేత్తను నియమించింది. ఆయన ఎవరో కాదు అణుబాంబు రూపకర్తగా పేరొందిన జె.రాబర్ట్ ఓపెన్హైమర్. ఆ ప్రాజెక్టులో రూపొందించిన తొలి అణుబాంబును 1945 జులై16న ఉదయం 5.30 నిమిషాలకి పరీక్షించారు. అప్పుడు వెలువడిన కాంతిని చూసి ‘ఒకేసారి వేయి సూర్యుల కాంతి ఆకాశంలోకి ప్రసరిస్తే ఎంతో అంత దేదీప్యమానమైనది నా తేజస్సు’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటల్ని సంస్కృతంలో ఎవరూ ఊహించని విధంగా హైమర్ పలికాడు. తర్వాత అమెరికన్లు జపాన్లోని హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు ప్రయోగించినప్పుడు సంభవించిన వినాశనం చూసి ఈయన చలించిపోయాడు. అణ్వస్త్రాల నిషేధంపై పోరుసాగించాడు. అణుశక్తిని మానవాళి అభ్యున్నతికి వినియోగించాలని ప్రచారం చేశాడు.
***పదకొండేళ్లకే ఉపన్యాసం!
* హైమర్ 1904, ఏప్రిల్ 22న అమెరికాలోని న్యూయార్క్లో జన్మించాడు. అమ్మానాన్నలది జర్మనీ. వీరు ధనికులు, దయాగుణం కలవారు.
* చిన్నప్పటి నుంచే చురుకుగా, తెలివిగా ఉండే హైమర్ ఐదేళ్ల వయసులో తాతగారు ఇచ్చిన కొన్ని ప్రత్యేకమైన రాళ్లను పరిశీలిస్తూ, భూగర్భశాస్త్రం(జియాలజీ)పై ఇష్టం పెంచుకున్నాడు.
* సంగీతం, చిత్రలేఖనంపై తల్లి ఆసక్తి ఏర్పరిచింది. తనకు ఇష్టమైన ఆట వస్తువు మైక్రోస్కోప్. పిల్లలతో కలిసి ఆడుకోకుండా నీటి బిందువుల్ని పరిశీలిస్తూ సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేస్తూ కాలం గడిపేవాడు.
* ఆ తర్వాత మంచి పాఠశాలలో చేరిన హైమర్ గ్రీకు, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్ భాషలపై ఇష్టం పెంచుకున్నాడు. చిన్నప్పుడే గ్రీకు వేదాంత గ్రంథాలు చదివేశాడు. ఆయా భాషల్లో కవిత్వం రాసేవాడు.
* అమెరికాలోని భూగర్భ శాస్త్రవేత్తలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాడు. తన రాతని చూసి వారు తనని బాలుడిగా గుర్తించి లెక్క చేయరేమోనని ఉత్తరాల్ని టైప్ చేసి పంపేవాడు. శాస్త్రవేత్తలు హైమర్ బాలుడని తెలియక న్యూయార్క్ మినరలాజికల్ క్లబ్ సభ్యునిగా చేసి, అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించారు. అప్పటికి హైమర్ వయసు 11ఏళ్లు.
* ఈ బాలుడిని చూసిన శాస్త్రవేత్తలు ముందు ఆశ్చర్యపోయారు. స్టేజీపై కుర్చీలో కూర్చుంటే ఈ పిల్లాడి పాదాలు నేలకు తగల్లేదట. తర్వాత తన ఉపన్యాస ప్రతిభకు వారు అవాక్కయ్యారు.
***అణుబాంబు వైపు…
* 19 ఏళ్లప్పుడు రసాయనశాస్త్రం ముఖ్యాంశంగా హార్వర్డ్లో చేరాడు. ఆ కోర్సుతో పాటు మరెన్నో శాస్త్రాలు చదివాడు. గ్రాడ్యుయేషన్ స్థాయిలో మరెవ్వరికీ రానన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు.
* 24 ఏళ్లకే సంస్కృతంతో పాటు ఏడు భాషలపై పట్టు సంపాదించాడు. కొన్నాళ్ల తర్వాత తిరిగి భూగర్భశాస్త్రంపై దృష్టి పెట్టాడు. రాళ్ల నమూనాలు సేకరించడమే కాకుండా ఆ శాస్త్ర సంబంధిత గ్రంథాలయాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు.
* ఓ దశలో భౌతిక శాస్త్రవేత్తగా స్థిరపడాలని నిర్ణయించుకుని హార్వర్డ్ నుంచి ఇంగ్లాండుకు వెళ్లాడు. అక్కడ కేంబ్రిడ్జ్లోని కేవిండిష్ ల్యాబొరేటరీలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు రూథర్ఫర్డ్, నీల్స్బోర్ల పర్యవేక్షణలో పరిశోధనలు జరిపాడు. తర్వాత జర్మనీలోని గాటింజన్ యూనివర్సిటీకి వెళ్లాడు. పీహెచ్డీ డిగ్రీ పొందాడు.
* అక్కడి నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన హైమర్ గొప్ప శాస్త్రవేత్తగా పేరుపొంది కాలిఫోర్నియా యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రొఫెసర్గా చేరాడు.
* అప్పుడే యూరప్లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అమెరికా అణుబాంబును నిర్మించాలని తీర్మానించింది. ఈయన అప్పటికే న్యూక్లియర్ సైన్సులో పరిశోధనలు ప్రారంభించి ఉన్నాడు. ఒక ఆటంబాంబు తయారీకి ఎంత యురేనియం మూలకం కావాలో లెక్కకట్టి ఉన్నాడు. దీంతో ఆయనను అమెరికా ప్రభుత్వం అణుబాంబు తయారీకై ‘మన్ హటన్ ప్రాజెక్టు’కు డైరెక్టరుగా నియమించింది.
* హైమర్ వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో కలిపి 4,500మంది నిపుణులతో అణుబాంబును తయారు చేశాడు. న్యూమెక్సికోలో ఓ ఎడారిలో తొలి అణుబాంబును పరీక్షించారు.
* తన పర్యవేక్షణలో తయారైన అణుబాంబు జపానులోని హిరోషిమా, నాగసాకిలపై ప్రయోగించినప్పుడు జరిగిన ప్రాణనష్టానికి ఖిన్నుడయ్యాడు.
* అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఆయనకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేసిన సమయంలో ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఇకపై అణ్వస్త్రాల్ని నిర్మించడానికి నేను వ్యతిరేకిని’ అని అందరి ముందు చెప్పడం ఆయనలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ తర్వాత ప్రిన్స్టన్లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’ కు డైరెక్టరుగా నియమితుడయ్యాడు. అమెరికా ఆటమిక్ ఎనర్జీ కమిషన్కు ఛైర్మన్గానూ పని చేశాడు. క్యాన్సర్ వ్యాధితో 63 ఏళ్లకే మరణించాడు.
అణుబాంబు కనిపెట్టింది ఈయనే
Related tags :