1.టిటిడీలో ఫలితానిస్తున్న కొత్త ప్రయోగం- ఆద్యాత్మిక వార్తలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విద్యార్థులతో చేపట్టిన కానుకల లెక్కింపు ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తోంది. పరకామణిలోని కానుకలు విద్యార్థులు లెక్కించడంతో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకే లెక్కింపు పూర్తయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు హుండీ కానుకల లెక్కింపు జరుగనుంది. సిబ్బంది కొరత కారణంగా రోజురోజుకు నగదు నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యార్థులతో హుండీ కానుకల లెక్కింపు చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం విద్యార్థులతో లెక్కింపు చేయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. శ్రీవారి సేవకుల స్థానంలో విద్యార్థులతో శాశ్వత ప్రాతిపదికన కానుకలు లెక్కింపు చేయించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తెలిపారు.
2. కిటకిటలాడిన గురువాయూర్ ఆలయం!
కేరళలోని త్రిశ్శూర్ జిల్లా గురువాయూర్ దేవాలయంలో ఆదివారం విపరీతమైన రద్దీ నెలకొంది. స్వామి వారి దర్శనార్థం వచ్చేవారితోపాటు.. వివాహ బృందాలు, తమ పిల్లలకు అన్నప్రాసన చేసుకునేవారు పెద్దఎత్తున తరలివచ్చారు. మలయాళ పంచాంగం ప్రకారం ఈ నెల 17న కేరళీయులకు నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల చింగం మాసాన్ని వారు శుభప్రదంగా భావిస్తారు. చింగం నెలలో మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుంటే.. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందనేది భక్తుల నమ్మకం. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో ఆలయం తెరవకముందే మూడు కల్యాణ మండపాల్లో జనాలు నిండిపోయారు. ఆ ప్రాంగణమంతా పెళ్లి బాజాలతో మారుమోగింది. ఒక్క ఆదివారం రోజే.. గురువాయూర్ ఆలయంలో 186 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. 689 మంది చిన్నారులకు అన్నప్రాసన జరిగింది. ఇలా వివాహాలు, అన్నప్రాసనల కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిటకిటలాడాయి.
3. బ్రహ్మోత్సవాల్లో దాతలకు ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా దాతలకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తితిదేకు చెందిన వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలతో పాటు గదుల కేటాయింపు సౌకర్యాన్ని సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 10 వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
4. తితిదే ట్రెజరీలో 5కిలోల వెండికిరీటం మాయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తితిదే ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు. అసలు ఈ ఘటనకు కారకులెవరన్న విషయంపై తితిదే దృష్టి సారించకుండా.. కేవలం ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనొక్కరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
టిటిడీలో ఫలితానిస్తున్న కొత్త ప్రయోగం
Related tags :