Politics

రాజధాని తరలిస్తే ఖబడ్దార్

We will fight for capital area farmers says sujana and kanna

ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని యోచిస్తే అందుకు తాము.. అంగీకరించమని ఏపీ భాజపా ప్రకటించింది. రైతుల పక్షాన పోరాడతామని ఆపార్టీ నేతలు తెలిపారు. మంగళవారం నాడు అమరావతిలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి భాజపా అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ అమరావతిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అమర్వతిని రాజధానిని అందరూ ఆహ్వానించారని జగన్ కూడా అమరావతిని స్వాగతించినట్లు గుర్తని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మాట తప్పడం.. మడమ తిప్పడం అన్న నేతలు.. ఇప్పుడు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని జగన్ ను విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పటడుగులు వేస్తోందని ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆత్రం తప్ప పని కనిపించడం లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నామని మరచిపోయి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని కన్నా విమర్శించారు. చంద్రబాబుకు పట్టిన గతే వైకాపాకి పడుతుందని హెచ్చరించారు. అవినీతిని నిరూపించేందుకు ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధాని విషయంలో ఏం చేయబోతున్నారో జగన్ చెప్పాలని ఆయన నిలదీశారు. రాజధానిని మార్చుతామంటే భాజపా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతుల్లో నెలకొన్న భయందోలనను ముఖ్యమంత్రి జగన్ పోగొట్టాలని కన్నా అన్నారు. ఒక రాజకీయ పార్టీని చూసి రైతులు రాజధానిని భూములు ఇవ్వలేదని అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని పనులు ఆపటం లేదని మంత్రి బొత్స అసెంబ్లీలో చెప్పిన విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ రాజధాని అనేది తప్పనిసరని అన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే దాని గురించి విచారణ చేయాలన్నారు.ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే ఉంటుందని, రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. రాజధాని రైతులకు అన్ని విధాలా బీజేపీ అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.