Politics

ఏపీలో లంచం వినిపించకూడదు. కనిపించకూడదు.

AP CM YS Jagan Meets Registration Dept Officials And Warns Not To Accept Bribes

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై అధ్యయనం చేసి ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులను విభాగాల వారీగా అధికారులు సీఎంకు నివేదించారు. వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధిలేదని అధికారులు స్పష్టం చేశారు. స్టీల్, ఐరన్‌ రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోందన్నారు. సిమెంటు రేటు కూడా తగ్గడంతో దానిపై వచ్చే పన్నులు తగ్గుతున్నాయని చెప్పారు. వాహన రంగంలో మందగమనంతో జీఎస్టీ తగ్గిందని సీఎంకు అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–2019లో 125 లక్షల కేసుల మద్యం విక్రయం జరిగిందన్నారు. బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై నాటికి 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని తెలిపారు. మద్య నియంత్రణ, నిషేధానికి, డీఎడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద 503 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. మద్యం దుకాణాల ఏర్పాటు ద్వారా 16వేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. స్మగ్లింగ్‌ జరగకుండా, నాటు సారా తయారీ కాకుండా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో ఉంచాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలన్నారు. మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను వినియోగించాలని సూచించారు.