ఏపీ, తెలంగాణలో తెదేపా శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే పార్టీ తెదేపా అని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన తెదేపా కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శలు సరికాదన్నారు. గతంలో దూరదృష్టితో ఆలోచించి కష్టపడి పనిచేశామని.. తాము తీసుకున్న నిర్ణయాలతోనే తన మానసపుత్రిక హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. తాను ఆశావాదినని.. ఎప్పుడూ అధైర్యపడబోనని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో నాయకులు వెళ్లారు కానీ కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదని చెప్పారు. తెలంగాణలో తెదేపా పుంజుకునేలా చేస్తామని.. కార్యకర్తల నుంచే మళ్లీ నాయకులను తయారు చేస్తామన్నారు. తెలుగు ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. ఒక్క అవకాశం అంటూ అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారని పరోక్షంగా వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి తెలుగువారి శాశ్వత ఆస్తి
Related tags :