Fashion

గోళ్ల సౌందర్య చిట్కాలు

Nail Fashion Tips - Telugu Fashion News-గోళ్ల సౌందర్య చిట్కాలు

అలంకరణలో గోళ్లూ ఓ భాగమే. అవి ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. మేనిక్యూర్‌, పెడిక్యూర్‌లు చేయించుకోవడమే కాదు… వాటి విషయంలో రోజూ తగినంత శ్రద్ధ తీసుకోవాలి. నెయిల్‌ఆర్ట్‌ వేసుకోవడంలో సులువైన మెలకువలు పాటించాలి.

* గోళ్లకూ క్లెన్సింగ్‌…
ముందుగా చేతుల్ని కాస్త వంటసోడా వేసిన నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. గోరువెచ్చని నీళ్లల్లో కాస్త పంచదార, గులాబీ రేకలు, ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌, రెండు చుక్కల లిక్విడ్‌ సోప్‌ వేసి అందులో చేతివేళ్లను ఐదు నిమిషాలు ఉంచాలి. తరువాత చల్లటి నీళ్లతో కడిగేసి పొడివస్త్రంతో తుడవాలి. ఈ ప్రక్రియ అయ్యాక రెండు చుక్కల బాదం నూనెను వేళ్లకు రాసుకుని మృదువుగా మర్దన చేసి, గోళ్లు కత్తిరించుకోవాలి. అవి తేమను కోల్పోకుండా ఉంటాయి. గోళ్లచుట్టూ ఉన్న చర్మానికి కొద్దిగా మాయిశ్చ రైజర్‌ రాసుకోవాలి.

* రంగు వేసే పద్ధతి…
మొదట బేస్‌కోట్‌ వేసుకోవాలి. ఇది గోళ్లపై మరకలు పడకుండా కాపాడుతుంది. ఆరాక మీకు నచ్చిన రంగుని పల్చగా వేసుకోవాలి. అది ఆరాక మరో పొర వేయాలి. చివరిగా టాప్‌ కోట్‌ వేసుకోవాలి. రంగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు నెయిల్‌ ఆర్ట్‌ని ఇష్టపడుతున్నారు. దాన్ని ఇంట్లోనే సులువుగా ప్రయత్నించవచ్చు. ఎలాగంటే…
రంగులతో: ముదురు, లేత ఛాయల్లో రంగులు తీసుకోవాలి. మీకు నచ్చిన వర్ణాన్ని గోళ్లకు వేసుకోవాలి. అది ఆరాక మరో రంగుతో అక్కడక్కడా చుక్కలు లేదా నిలువు గీతల్ని గీయాలి. లేదంటే నచ్చిన ఆకృతిలో మైక్రో స్టెన్సిల్‌ అంటించి దానిపై రంగు వేస్తే చాలు. మెరుపుల్నీ జతచేస్తే గోళ్లు జిగేల్‌మంటాయి.
పూసలు, రాళ్లు: బజారులో మైక్రోబీడ్స్‌ దొరుకుతాయి. గోళ్లరంగు, పూసలు ఒకే రంగులో ఉండేలా చూసుకోవాలి. ముందుగా రెండు కోట్‌లు వేసుకుని వేలిని పూసలున్న సీసాలో ముంచండి. అవి చక్కగా అమరిపోతాయి. ఆరాక పైన పారదర్శకంగా ఉండే మరో నెయిల్‌పాలిష్‌ కోట్‌ని వేస్తే చాలు. గమ్‌లో ముంచిన స్టోన్‌, చిప్స్‌ వంటివీ అతికించుకోవచ్చు.

* ఈ చిట్కాలూ తప్పనిసరి…
గోళ్లపై క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండాలంటే… వాటిని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. ఎక్కువ సేపు నీళ్లల్లో నానితే అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. బట్టలు ఉతికినా, గిన్నెలు తోమినా… గ్లవుజులు వేసుకోవడం మంచిది. టూత్‌బ్రష్‌పై కాస్త ఉప్పు వేసి గోళ్ల చుట్టూ మృదువుగా రుద్దితే మురికి, మట్టి వంటివి వదిలిపోతాయి.
* క్యాల్షియం, బయోటిన్‌, విటమిన్‌ ఇ, ఇనుము, మాంసకృత్తులు, జింక్‌ వంటి పోషకాలన్నీ గోళ్ల ఆరోగ్యానికి అవసరం. మీ ఆహారంలో సోయా, బీట్‌రూట్‌, తృణధాన్యాలు, ఆకుకూరలు… వంటివన్నీ భాగం చేసుకోవాలి.
* జెల్స్‌, అక్రిలిక్స్‌ రంగులు చూడ్డానికి బాగున్నా… వీటికి వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. లేదంటే ఇవి గోళ్లను పొడిబారేలా చేస్తాయి. పారాబిన్‌, సల్ఫేట్‌, ఎసిటోన్‌ వంటి రసాయనాలు లేని రంగుల్ని వాడాలి. వాటివల్ల గోళ్లు పేలవంగా, పెళుసుగా మారతాయి. పొడిబారి త్వరగా చిట్లిపోతాయి.

Image result for nail fashion

Image result for nail fashion

Image result for nail fashion

Image result for nail fashion