Editorials

మాకు చైనా వంటి స్నేహితుడు ఉండటం అదృష్టం

Pakistan Railway Minister Rashid Warns Nuclear War With India

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో గందరగోళానికి గురైన పాకిస్థాన్ ఏదో ఒక రూపంలో భారత్‌ను ఎండగట్టాలనే చూస్తోంది. తాజాగా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అక్టోబరు, నవంబరులో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉందని బెదిరించే ప్రయత్నం చేశారు. బుధవారం రావల్పిండిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నిజంగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలనుకుంటే ఐరాస భద్రతా మండలి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేది. ఆక్రమిత లోయలోని ప్రజల పక్షానే మేం నిల్చుంటాం. మొహర్రం తరవాత మరోసారి కశ్మీర్‌లో పర్యటిస్తాను. ఇప్పటికీ భారత్‌తో చర్చల గురించి ఆలోచించే వారు తెలివితక్కువ వారే’ అని తన నోటికి పనిచెప్పారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఐరాసలో ఇవ్వబోయే ప్రసంగం గురించి ప్రస్తావించారు. ‘సెప్టెంబరు 27న ప్రధాని ఐరాసలో ఇవ్వనున్న ప్రసంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. మాకు చైనా వంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం’ అని రషీద్ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌ నుంచి వచ్చే విమానాలకు గగనతలాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మంగళవారం ఆ దేశ మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా బుధవారం కరాచీ గగనతలం మీదుగా మూడు వైమానిక మార్గాలను మూసివేసినట్లు పాక్‌ వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన దగ్గరి నుంచి అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్‌ విశ్వప్రయత్నం చేస్తోంది. దానికి సరైన మద్దతు లభించకపోయే సరికి అణు యుద్ధం వస్తుందని, పుల్వామా వంటి దాడులు జరగుతాయని పాక్‌ ఏదో ఒక రూపంలో బెదిరింపులకు దిగుతూనే ఉంది.