తితిదే ట్రెజరీ నుంచి శ్రీవారి ఆభరణాలు మాయమైన వ్యవహారంపై భాజపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ కార్యాలయానికి వెళ్లిన భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి ఆయనకు ఫిర్యాదు అందజేశారు. భక్తులు సమర్పించిన నగలను మాయం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం భానుప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తితిదే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తామే మీడియాకు చెప్పేంత వరకు తితిదే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎవరో ఒకరు ప్రశ్నిస్తే తప్ప తితిదే స్పందించదా? భక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తితిదేకు లేదా? అని నిలదీశారు. ఎవరినో కాపాడాలని తితిదే అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తాము తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఫలితం రాని పక్షంలో భక్తులతో కలిసి భాజపా ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరుతున్నట్టు చెప్పారు.
తిరుమల ట్రెజరీ నుండి శ్రీవారి వెండి కిరీటం మాయం
Related tags :