Movies

విద్యా బాలన్‌ను గదికి పిలిచిన దర్శకుడు

Vidya Balan Shares Her Casting Couch Experiences

సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరిట నటీమణులను నమ్మించి వంచిస్తున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రయాణం ఆరంభంలో తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తెలిపారు. ఇటీవల ఆమె నటించిన మిషన్‌ మంగళ్‌ సినిమా విజయవంతమైన సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని ఆమె తెలిపారు. అంతేకాకుండా మరొక నిర్మాత తనను చూసి నీది హీరోయిన్‌ ముఖమేనా అని అన్నారని ఆనాటి చేదు అనుభవాలను గుర్తుతెచ్చుకున్నారు. ‘ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఓ దర్శకుడు నన్ను కలవడానికి వచ్చి, మీతో మాట్లాడాలి రూమ్‌లోకి వెళ్దాం అన్నాడు. కాఫీ షాప్‌లో కూర్చొని మాట్లాడుకుందాం అంటే అతను ఒప్పుకోలేదు. తీరా హోటల్‌ రూంలోకి వెళ్తే.. ఆ వ్యక్తి వెంటనే రూమ్‌ తలుపు వేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. నాకు కోపం వచ్చి గట్టిగా మాట్లాడి తలుపు తీసి వెళ్లిపోమన్నట్లు చూశాను. వెంటనే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని చెప్పారు. ‘కెరీర్‌ ఆరంభంలో నా తల్లిదండ్రులతో కలిసి సినీ అవకాశాల కోసం ఓ నిర్మాతను కలుద్దామని వెళ్తే.. ఆయన నన్ను చూసి నీది హీరోయిన్‌ ముఖమేనా అన్నార’ని తెలిపారు. ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్‌ స్థానానికి చేరుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన మిషన్‌ మంగళ్‌ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.