ప్రయాణికుల అభిమానాన్ని మరింతగా చూరగొనడం లక్ష్యంగా భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణికుల రైళ్లు, సరకు రవాణా రైళ్ల స్థాన చలనాన్ని రియల్ టైంలో తెలుసుకోగలిగేందుకు ఇది సాయపడనుంది. ఇందుకోసం కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్ (సీఓఏ) అనే వ్యవస్థను ఇస్రో రూపొందించింది. జీపీఎస్ అమర్చిన 700 రైళ్లతో ఈ వ్యవస్థను అనుసంధానించనున్నారు. తద్వారా స్టేషన్‌లోని కంట్రోల్ గది నుంచి రైలు ఏ స్టేషన్ల మధ్య ఉన్నదీ కచ్చితత్వంతో రియల్ టైంలో తెలుసుకోవచ్చు. ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్ల కదలికలను కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించే పరిజ్ఞానం కోసం తొలుత రైల్వే ఇస్రోను సంప్రదించింది. రైల్వేకు ప్రయాణికుల కన్నా సరకు రవాణా రూపంలోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. గూడ్స్ రైళ్లలో తరచూ సరకు దొంగతనాలు జరుగుతుండడంతో వీటిని నివారించడం రైల్వేకు కష్టంగా తయారైంది. ఈ పరిజ్ఞానం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. ‘‘గూడ్స్ రైళ్లను మధ్యలో ఆపి అందులోని బొగ్గు, చమురు వంటివారిని కాజేస్తుంటారు. సీఓఏ పరిజ్ఞానం వల్ల ఇక దొంగతనాలు జరిగే అవకాశం లేదు. రైలు ఎక్కడైనా అనుమానాస్పదంగా ఆగినట్లు తేలితే వెంటనే సమీపంలోని ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుంటారు.’’ అని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ వివరించారు. రైల్వేశాఖ కొన్ని రకాల రైళ్లలో టికెట్ ధరలపై 25 శాతం వరకూ రాయితీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏసీ చైర్ కార్, ఉన్నత శ్రేణుల్లో ఈ పథకాన్ని సెప్టెంబరు నుంచి అమలు చేయనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. శతాబ్ది, గతీమాన్, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటీ రైళ్లకు రాయితీ పథకం వర్తించనుంది. వీటితోపాటు గతేడాది నెలవారీ ఆక్యుపెన్సీ 50 శాతం కన్నా తక్కువగా ఉన్న రైళ్లన్నీ ఈ పథకం పరిధిలోకి రానున్నాయి.
ఇస్రో సరికొత్త సాంకేతికత
Related tags :