Devotional

క్షమాగుణం అంటే ఏమిటి?

What Is Forgiving Character - Telugu Devotional News

మన మనసులో రెండు వైరుధ్య భావాలుంటాయి. ఒకటి క్షమించడం. రెండోది పగతీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. అదే ‘కురుక్షేత్రం’. క్షమ గెలిస్తే హృదయం ఆనందమయం. మనసులో అంతులేని సంతోషం. మనిషికి తృప్తి. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ ‘క్షమించు క్షమించు’ అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం. ‘గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే’ అంటుంది భారతం. పగవల్ల పగపోదనీ, ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అనీ భారత మహేతిహాస ఉద్బోధ!’నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా’ అని ‘కన్నుకు కన్ను పన్నుకు పన్ను’ సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా గుడ్డివాళ్లతో, బోసినోటివాళ్లతో నిండిపోతుంది. ఈ పగ, ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం. ఇందువల్ల రెండు లాభాలు. ఒకటి- క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది. ‘పొరపాటు మానవ సహజగుణం, క్షమ దైవ విశిష్టగుణం’ అని ఆంగ్ల సామెత. మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు.ఏకనాథుడు పాండురంగడి భక్తుడు. ప్రశాంతచిత్తుడు. సదా స్వామి సేవలో, భజనలో కాలం గడిపేవాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు. ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు. ఏకనాథుడు రోజూ తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మి వేశాడు. ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో, చిరునవ్వు చెరగనీయకుండా వెనక్కి వెళ్లి నదీస్నానం ఆచరించాడు.. ఇలా మొత్తం నూట ఏడుసార్లు జరిగింది. ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా, మందస్మిత వదనంతో అన్నిసార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు. దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది! ఆయన ఏకనాథుడి కాళ్లపై పడ్డాడు. ‘స్వామీ, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి, ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు. మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశచూపారు. మీ క్షమాగుణం తెలియక నేనీ నీచకృత్యానికి అంగీకరించాను!’ అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో. ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. ‘నాయనా, నీవు నాకెంతో మేలుచేశావు. నాచేత నూట ఎనిమిదిసార్లు పవిత్ర నదీస్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచిపోను!’ ఏకనాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్నుడయ్యాడు. ఆ భక్తాగ్రేసరుడి క్షమాగుణం ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు.క్షమ అంటే భూమి. భూమి ఓర్పుగల తల్లి కనుకనే మనం ఎంత బాధపెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదేపనిగా హింసించకూడదు. క్షమాగుణానికీ హద్దులుంటాయని గుర్తుంచుకోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు. ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషులెందరో ఉన్నారు. ఆర్యసమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపైంది. ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి, ఆహారంలో విషం పెట్టించారు. దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు. తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు. ‘వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు!’
తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు. పగతీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే! నిజానికి అభద్రత మిగులుతుంది. చిత్తవికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది. ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది- ‘ఇతరులు మనకు చేసిన అపకారాలను ఇసుకపై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉపకారాలను చలువరాయిపై చెక్కుకోవాలి!.
1. వినాయకుడి పూజ మహిళలు చేయకూడదంటారు ఎందుకు?
వినాయక చవితి పూజ మహిళలు చేసుకోవచ్చు. నిషేధం ఎక్కడా లేదు. నిత్యపూజ గానీ, వినాయకచవితి నాటి వ్రతం గానీ.. ఎలాంటి సందేహం లేకుండా మహిళలు ఆచరించవచ్చు. అయితే, కోరికలతో మొక్కుకుని వినాయకునికి చేసే పూజలు (కామ్యకర్మలు) మాత్రం మహిళలకు నిషేధం అన్నారు పెద్దలు. వినాయకుడు బ్రహ్మచారి కావడమే కారణమని చెబుతారు. గణపతి భార్యలుగా చెప్పే సిద్ధి, బుద్ధి కార్యసిద్ధికి, సద్బుద్ధికి సంకేతాలు మాత్రమే.
2. తితిదే ఖజానాలో రూ.7 లక్షల ఆభరణాలు మాయం
ఖజానా నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానం డొల్లతనం మరోసారి బయటపడింది. రూ.7.36 లక్షల ఆభరణాలు పోయినా.. కప్పిపుచ్చుతూ వచ్చి, ఏఈవోను బాధ్యుడిని చేస్తూ జీతం నుంచి సొమ్ము వసూలు చేస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం కావడంతో సెప్టెంబరులో మరోసారి ఖజానాలోని ఆభరణాలు పరిశీలిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో తెలిపారు. భక్తులిచ్చిన ఆభరణాలను ఖజానాలో తితిదే భద్రపరుస్తుంది. ప్రతిరోజూ జమయ్యే నగలను లెక్కించి తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేస్తుంది. దీన్ని ఏఈవో స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.
3. యాదాద్రిలో ప్రసాదాలు లేవు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మంగళవారం లడ్డూ, పులిహోర ప్రసాదాలు నిలిచిపోయాయి. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆలయ విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టే దశలో పాత భవనాలను తొలగించాలన్న సీఎం నిర్ణయంతో ప్రసాదాల తయారీ, గోదాం, వ్రతాల మండపం, అన్నదానం విభాగాలను, సామగ్రిని పాతగుట్టకు తరలించారు. దీంతో ప్రసాదాల తయారీ, విక్రయాలు ఆగిపోయాయి. ప్రసాదాల తయారీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. సామగ్రి, యంత్రాల బిగింపునకు సమయం పడుతుందని , రెండు మూడు రోజులపాటు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చని ప్రసాదాల తయారీ విభాగం ఇన్ఛార్జి, ఏఈవో చంద్రశేఖర్ అన్నారు. శ్రీస్వామి నిత్యకల్యాణం నిర్వహించే ఆర్జిత భక్తులకు మాత్రం ప్రసాదాలను అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
4. జెరూసలెం యాత్ర రోజుల సంఖ్య పెంపు
క్రైస్తవుల పవిత్ర క్షేత్రం అయిన జెరూసలెం, ఇతర పవిత్ర స్థలాల సందర్శన రోజుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 8 రోజులు/7 రాత్రులుగా ఉన్న రోజుల సంఖ్యను 10 రోజులు/9 రాత్రులకు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
5. దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.64కోట్లు
మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీ కానుకలు మంగళవారం లెక్కించారు. 29 హుండీల్లో 20 రోజుల్లో రూ.2,64,03,579 భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు అధికారులు తెలిపారు. 21 హుండీల్లో వేసిన కానుకలు లెక్కించాల్సి ఉంది. కానుకలతో పాటు 610 గ్రాముల బంగారం, 7.800 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో భక్తులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈవో సురేష్బాబు కానుకల లెక్కింపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు వయోవృద్ధులు, స్వచ్ఛందసేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
7. జగన్మాత సేవలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో సురేష్బాబు ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
8. సెప్టెంబరు 29న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 29న అంకురార్పణ చేయనున్నట్లు తితిదే తెలిపింది. సెప్టెంబరు మాసంలో విశేష ఉత్సవాలను ప్రకటిస్తూ.. 1న శ్రీవరాహ జయంతి, శ్రీబలరామ జయంతి, 2న వినాయక చవితి, 3న రుషి పంచమి, 10న శ్రీవామన జయంతి, 12న అనంత పద్మనాభవ్రతం, 30న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం జరుగుతుందని వివరించింది.
9. తితితే ధర్మకర్తల మండలి జాబితాలో జూపల్లి రామేశ్వర్రావు!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల జాబితా దాదాపు ఖరారైంది. పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ప్రతిపాదనల్లో ఉన్న పేర్లపై చర్చించి తుది జాబితాకు ఆమోదం తెలిపారని సమాచారం. ప్రస్తుతం పాలకమండలి సభ్యుల సంఖ్య 19 ఉండగా.. ఈసంఖ్యను 25కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చట్టసవరణ చేస్తూ ఆర్డినెన్స్ను తేవాలి. గవర్నర్ వద్దకు పంపేందుకు దస్త్రం సిద్ధం చేస్తున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. గవర్నర్ ఆమోదముద్ర వేయగానే సభ్యుల పేర్లు వెల్లడించనున్నారు. తమిళనాడు నుంచి ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి కృపేందర్ రెడ్డి, సుందర్, తెలంగాణ నుంచి ముగ్గురుండనున్నారు. పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఏపీ నుంచి ఎమ్మెల్యేల్లో యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పదవిరీత్యా తితిదే పాలకమండలిలో సభ్యుడుగా ఉండనున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి పేరు కూడా సభ్యుల జాబితాలో ఉండొచ్చన్న ప్రచారం ఉన్నా, గతంలో ఛైర్మన్గా చేసి, సభ్యుడిగా కొనసాగేందుకు భూమన సుముఖత వ్యక్తం చేయడం లేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
10. శ్రీవారి లడ్డూ కోసం జూట్బ్యాగ్!
శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకువెళ్లడానికి ఇక ప్లాస్టిక్ కవర్లతో ఇబ్బందులు పడనక్కర్లేదు. ఇందుకోసం చూడముచ్చటగా చక్కని జూట్బ్యాగులను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగానే ఇది అమలులోకి వచ్చింది. టీటీడీ కోరిక మేరకు సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాభనష్టాలు చూడకుండా తయారీ ధరకే జనపనార సంచులను విక్రయించడానికి అంగీకరించింది. దీంతో గత సోమవారం నుంచి వీటి విక్రయాలు లాంఛనంగా మొదలుపెట్టారు. తొలినాళ్లలో హాకర్లే రకరకాల బొమ్మలు ముద్రించిన ప్లాస్టిక్ కవర్లు లడ్డూ కౌంటర్ల వద్ద విక్రయించేవారు. కొంతకాలానికి హాకర్ల ఆగడాలు పెచ్చుమీరడంతో టీటీడీయే సొంతంగా కవర్ల విక్రయం ప్రారంభించింది. ఆ తర్వాత ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం ఉద్యమంగా మారడంతో నిబంధనల మేరకు యాభై మైక్రాన్ల పైబడిన బయో డీగ్రేడబుల్ కవర్లను మాత్రమే తయారుచేయించి విక్రయిస్తూ వచ్చింది. ఇటీవల చిత్తూరు జిల్లావ్యాప్తంగా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలులోకి వస్తుండడంతో టీటీడీ కూడా ఆదిశగా అడుగులువేసింది.
11. శ్రీవారికి కోటి విరాళం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి విశాఖపట్టణానికి చెందిన దేవీ ఫిషరీస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యార్లగడ్డ సూర్యారావు గురువారం రూ.కోటి పదివేల విరాళాన్ని అందజేశారు. అ సందర్భంగా శ్రీవారిని దర్శించుకొని రంగనాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని సూచించారు.