రాష్ట్రంలో ఉన్న వైకాపా సర్కారు తెలుగుదేశం నాయకులను టార్గెట్ చేస్తుంది. సందు దొరికితే చాలు క్రిమినల్ కేసులు బనాయించడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖ తెదేపా నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ మాజీ విఫ్ విప్ కోన రవికుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్నారు. స్థానిక ఎంపీడీవో దుర్బాషలాడినట్లు ఆయనపై కేసు నమోదు అయింది. మాజీ మంత్రి తెదేపా రాజ్యసభ సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పైన అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. గురజాడ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మెడ చుట్టూ కేసులను బిగిస్తుంది. అక్రమ మైనింగ్ వ్యవహరంలో ఆయనపై వచ్చిన ఆరోపణలను సీబీఐకి అప్పగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. తాజాగా చీరాల శాసనసభ్యుడు కరణం బలరాంపై గురువారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మాజీ కౌన్సిలర్‌ను ఆయన బెదిరించినట్లు కేసు నమోదు అయింది. అయితే ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు, కడప జిల్లాల్లో తెదేపా దిగువ స్థాయి నాయకులపై ప్రతి నిముషం కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆయన కుమారుడు, కూతురుపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి. అయితే కోడెల ఆయన కొడుకు, కూతురిపై నమోదైన కేసులను మాత్రం రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. మరికొద్ది మంది తెదేపా సీనియర్ నేతలపై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చింతమనేని ప్రభాకర్ వంటి ప్రజాప్రతినిధులు దారుణంగా వ్యవహరించిన సంఘటనలపైన ప్రభుత్వం పునఃవిచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో తెదేపా నేతలపై కొట్టివేసిన క్రిమినల్ కేసులను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం తిరగదోడే సూచనలు కనిపిస్తున్నాయి.
సందు దొరికితే చాలు తెదేపా నేతలపై కేసులు–TNI ప్రత్యేకం
Related tags :