అక్బర్ ఎంత గొప్ప చక్రవర్తో, ఆయన దగ్గర మంత్రిగా ఉన్న బీర్బల్ అంతటి చతురుడు. ఎలాంటి సమస్యని అయినా చిటికెలో పరిష్కరించగల సమర్ధుడు. అందుకే బీర్బల్ అంటే అక్బర్ పాదుషాకి చెప్పలేనంత అభిమా నం. ఎందుకో ఒకసారి బీర్బల్ అం టే అక్బర్‌కు చాలాచాలా కోపం వచ్చేసింది. అంతే! తన కంటికి కనిపించనంత దూరానికి పొమ్మంటూ బీర్బల్‌ను దర్బారు నుంచి వెళ్లగొట్టేశాడు. వెళ్లగొట్టాడన్న మాటే కానీ, రోజులు గడిచేసరికి బీర్బల్ లేని లోటు కనిపించడం మొదలైంది. అతనంత తెలివిగా ఎవరూ సమస్యలని పరిష్కరించ లేకపోతున్నారు. దాంతో బీర్బల్‌ను తిరిగి తన ఆస్థానానికి రప్పించుకుంటే బాగుండు అనిపించింది అక్బర్‌కు. కానీ ఎంత వెతికినా బీర్బల్ జాడ తెలియలేదు. బీర్బల్ తన రాజ్యంలోనే ఎక్కడో మారువేషంలో తిరుగుతున్నాడని అక్బర్ నమ్మకం. దాంతో ఆయన బీర్బల్ ఎక్కడ ఉన్నాడో కనుగొనేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మర్నాడు అక్బర్ తన రాజంలో ఒక చాటింపు వేయించాడు.రాజ్యంలో ప్రతి గ్రామం నుంచీ తనకు ఒక కుండ నిండా తెలివిని నింపి పంపించాలని దాని సారాంశం. ఒకవేళ అలా తెలివిని నింపలేని పక్షంలో కుండ నిండా వజ్రవైఢూర్యాలు పంపాలని ఆదేశించాడు అక్బర్. రాజ్యంలో ఉన్న గ్రామ పెద్దలందరికీ ఏం చేయాలో పాలుపోలేదు. కంటికి కనిపించని తెలివితో కుండని నింపడం ఎలా? దానికంటే వజ్రవైఢూర్యాలతో కుండని నింపి పంపడమే తేలిక అని తోచింది.అలా ప్రతీగ్రామం నుంచీ వజ్రాలతో నిండిన కుండలు పంపడం మొదలు పెట్టారు. ఈ చాటింపు క్రమంగా బీర్బల్ మారు వేషంలో ఉన్న గ్రామానికి చేరింది. వెంటనే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి ‘మీరు అనవసరంగా వజ్రాలతో నిండిన కుండను పంపవద్దు. ఏ మాత్రం ఖర్చు లేకుండా కుండని పంపే పూచీ నాది’ అని భరోసా ఇచ్చాడు. ఊళ్లోకి కొత్తగా వచ్చిన ఈ వ్యక్తి ఏం చేస్తాడో చూద్దాం అనుకుని ఊరుకున్నాడు ఊరిపెద్ద.బీర్బల్ ఒక ఖాళీ కుండని తీసుకుని అందులో చిన్న పుచ్చకాయ ఉన్న తీగని ఉంచాడు. దానికి క్రమం తప్పకుండా నీళ్లు, ఎరువులు వేసి… కుండ అంతా నిండి పోయే దాకా పెంచాడు. ఆ తర్వాత దాన్ని తీగ నుంచి విడదీశాడు. ఆ కుండ మీద ‘ మీరు చెప్పినట్లుగానే ఈ కుండలో తెలివి పెట్టి పంపుతున్నాం. ఈ కుండకు కానీ, లోపల ఉన్న కాయకు కానీ నష్టం కలగకుండా పుచ్చ కాయను బయటకు తీయగలిగితే…. మీకు తెలివి కనిపిస్తుంది’ అని రాసి రాజధానికి పంపించాడు. తన దర్బారుకి చేరిన ఆ వింత కుండని చూడగానే అక్బర్‌కు అది బీర్బల్ పనే అని అర్థమై పోయింది. వెంటనే ఆ కుండ వచ్చిన గ్రామానికి స్వయంగా బయల్దేరాడు. అక్కడ సాధారణ రైతు వేషంలో ఉన్న బీర్బల్‌ను గుర్తుపట్టేశాడు. అతన్ని క్షమాపణ వేడుకుని సాదరంగా తనతో రాజధానికి తీసుకెళ్లాడు.
కుండలో తెలివిని నింపిన బీర్బల్
Related tags :