1. సెప్టెంబర్ 1 నుంచి ఇంటికే పింఛను
వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పింఛన్లను సెప్టెంబరు 1వ తేదీ నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శి, బిల్‌కలెక్టర్లు, వీఆర్‌వోలు ఆయా కార్యాలయాల వద్ద పింఛను పంపిణీ చేస్తున్నారు. తాజాగా గ్రామ, వార్డు వాలంటీర్లు కొలువుదీరిన నేపథ్యంలో వారికి శిక్షణలో భాగంగా వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి మొత్తాన్ని అందిస్తారు.
2. అక్టోబరులో గ్రామాభివృద్ధి ప్రణాళిక
గ్రామాల పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అక్టోబరు 5 లేదా 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ లోపు మరోసారి జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించి, మరింత స్పష్టత ఇస్తామన్నారు. కార్యాచరణ అమలు ప్రారంభానికి ముందే కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్రప్రభుత్వ నిధులు కలిపి ప్రతి నెలా రూ.339 కోట్ల వంతున ఎనిమిది నెలల పాటు గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
3. నిధుల్లేకుండా రాజధాని పనులెలా చేపడతాం
ఏపీ రాజధాని అమరావతిలో రూ.35వేల కోట్ల పనులకు గతంలో టెండర్లను పిలిచారని, వాటిలో నిధుల సమీకరణకు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకోని పనులన్నింటినీ రద్దు చేశామని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘నిధులను సమీకరించుకోకుండా పనులు చేస్తే బిల్లులెవరు చెల్లిస్తారు? ఇప్పటికే జరిగిన పనులకు రూ.2,800 కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
4. సర్వేయర్ నివేదికే అంతిమం కాదు
వాహనం ప్రమాదానికి గురైనప్పుడు నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన సర్వేయర్ నివేదికే అంతిమం కాదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. అధీకృత డీలరు మరమ్మతులకైన మొత్తాన్ని బిల్లుల రూపంలో సమర్పించినందున ఆ మొత్తం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉందని తెలిపింది. ఓ కేసులో ఐడీవీ కింద బీమా పాలసీ తీసుకున్న పాలసీదారుకు మిగిలిన మొత్తం రూ.1.20 లక్షలు 7.5 శాతం వడ్డీతో చెల్లించాలంటూ రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లను ఆదేశించింది.
5. కనకంబూ మోగేను!
పసిడి ధరల పెరుగుదలకు అడ్డేలేకుండా పోయింది. దేశీయంగా మేలిమి (999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర గురువారం రూ.40,000 దాటింది. వెండి కూడా కిలో రూ.49,000కు చేరింది. బంగారం ధర దేశీయంగా ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.40,300, వెండి కిలో రూ.49,000 ఉంది.
6. న్యాయ వ్యవస్థలో అవినీతి, కులతత్వం
న్యాయ వ్యవస్థలో అవినీతి, కులతత్వం ఉందంటూ పట్నా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ ఓ కేసు విచారణ సందర్భంగా ఆరోపించడం సంచలనం కలిగించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఆయన విచారణ పరిధిలో ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవడమే కాకుండా, ఆయన ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.
7. భారత్‌కు రూ.86,000 కోట్లు ఇస్తాం
ఇంటింటికి తాగునీటి సరఫరా, రహదారి భద్రత తదితర కార్యక్రమాల నిమిత్తం భారత్‌కు 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.86 వేల కోట్ల) సాయం అందిస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంకు హామీ ఇచ్చింది. ప్రధాని మోదీతో గురువారం దిల్లీలో బ్యాంకు అధ్యక్షుడు టకెహికో నకావో భేటీ అయ్యారు.
8. కశ్మీర్‌కే మా అగ్ర ప్రాధాన్యం: పాక్
ఐక్యరాజ్యసమితి తీర్మానాల మేరకు కశ్మీర్ సమస్యకు పరిష్కారం సాధించడానికే తమ విదేశీ విధానంలో అగ్ర ప్రాధాన్యం ఇస్తామని పాకిస్థాన్ స్పష్టం చేసింది. గురువారం విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకెప్పుడూ పాకిస్థాన్ మద్దతు ఇస్తుందని, భారతీయ నాయకత్వమే అందుకు సిద్ధంగా లేదన్నారు.
9. అత్యంత భద్రం.. టోక్యో నగరం
ప్రపంచంలో అత్యంత భద్రమైన నగరంగా మళ్లీ టోక్యో నిలిచింది. రెండు, మూడు స్థానాలను వరుసగా సింగపూర్, ఒసాకలు దక్కించుకున్నాయి. మన దేశ రాజధాని దిల్లీ 52వ స్థానంతో సరిపెట్టుకోగా, వాణిజ్య రాజధాని ముంబయి మాత్రం 45వ స్థానంలో నిలిచింది. ‘ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ… ఐదు ఖండాలకు చెందిన 60 నగరాల్లోని పరిస్థితులను మదింపు చేసి, ఈ ర్యాంకులను కేటాయించింది.
10. వెస్టిండీస్‌తో రెండో టెస్టు నేటి నుంచే
జోరును కొనసాగిస్తూ కరీబియన్ పర్యటనను అజేయంగా ముగించాలనే ఉత్సాహంతో భారత్ ఉంటే. సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. నేటి నుంచే చివరిదైన రెండో టెస్ట్. పేలవ ప్రదర్శనతో ఆతిథ్య జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో కోహ్లీసేనే తిరుగులేని ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నేటి ప్రధాన వార్తలు-08/30
Related tags :