Fashion

రోజు తలస్నానం దేనికి?

Do not hair bath every day. It ruins your scalp and hair health.

జుట్టు మురికిగా ఉన్నా లేకపోయినా… కొందరు రోజూ తలస్నానం చేస్తుంటారు. దానివల్ల మేలు జరగకపోగా… సమస్యలు ఎదురవుతాయని తెలుసా… ఎలాగో చదవండి మరి.
* రోజూ తలస్నానం చేస్తే జుట్టు పొడిబారి పీచులా మారిపోతుంది. షాంపూను రోజూ వాడటం వల్ల జుట్టు తేమనూ కోల్పోతుంది. తప్పదనుకుంటే… రోజుమార్చి రోజు లేదా వారానికి రెండుసార్లు చేస్తే చాలు.
* గాఢత ఎక్కువగా ఉండే షాంపూలతో జుట్టు చివర్లు చిట్లుతుంది. తలపై ఉండే చర్మం పొడిబారి పొలుసులుగా రాలుతుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తలస్నానం చేయడానికి గంట ముందు కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవాలి. తక్కువ గాఢత ఉండే షాంపూలను ఎంచుకోవాలి.
* తలస్నానం తరువాత జుట్టును పూర్తిగా ఆరబెట్టాలి. తడి జుట్టుతోనే జడ వేసుకుంటే చుండ్రు సమస్య పెరుగుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్‌ వృద్ధి చెంది ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
* షాంపూను నేరుగా తలకు పట్టిస్తే వాటిల్లో ఉండే రసాయనాలు కుదుళ్లలోకి చేరతాయి. దీంతో మాడు పొడిబారి, తల చర్మం సహజ నూనెలను స్రవించే గుణాన్ని కోల్పోతుంది. దీని ప్రభావంతో వెంట్రుకలు పీచులా, జీవం లేనట్లుగా తయారవుతాయి. షాంపూను చిన్న కప్పులో తీసుకుని కాసిని నీళ్లు కలిపి అప్పుడు తలకు రాసుకోవడమే దీనికి పరిష్కారం.
* బాదం నూనె, గుడ్డు తెల్లసొన వంటి వాటితో వారానికి ఒకసారైనా జుట్టుకు మర్దన చేసుకోవాలి. దీనివల్ల పొడిబారిన కురులు పట్టులా మెరుస్తాయి.