కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి మిశ్రమం, కాస్తంత స్థలం ఉంటే చాలు… అందమైన కుండీల్లో మొక్కలను వేలాడదీసుకోవచ్చు. పెరట్లో అంతగా కనిపించని మొక్కలను సైతం ఈ హ్యాంగింగ్ బాస్కెట్లలో ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. వివిధ వర్ణాల పూలతో కనువిందు చేస్తాయివి. వేలాడే కుండీల్లో నాటే మొక్కల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్ద కుండీల్లో పెంచేందుకు ఒకే జాతి మొక్కలను, మరీ చిన్న కుండీలైతే ఒకే జాతి మొక్కలతోపాటు ఒకే ఆకారంలో ఆకులు, పూలు అందించే వాటిని ఎంపిక చేసుకోవాలి. బహువార్షికాలను నాటితే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సూర్యరశ్మి, నీటిని ఒకే మోతాదులో తీసుకునే మొక్కలను గుంపుగా పెంచుకోవాలి. ఈ మొక్కల మధ్య సమతౌల్యం బాగుంటుంది.
* రంగులూ ముఖ్యమే: ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ, ఊదా రంగు మొక్కలను ఎంచుకోవాలి. ఏక వర్ణ మొక్కలు కావాలనుకుంటే ఎరుపు మేలు. ఏకవార్షిక పూల రకాలుగా ఆకుపచ్చ ఆకులున్నవి బాగుంటాయి. కుండీల రంగు, వాటిని వేలాడదీసే ప్రాంతం, బయటి వాతావరణాన్ని బట్టి మొక్కల వర్ణాన్ని ఎంపిక చేసుకోవాలి. వేలాడే, పాకే, లతలుగా ఎదిగే మొక్కలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
* ఎలాంటి కుండీలంటే: ఇనుప పళ్లాలు, వెడల్పాటి సీసాలు, ప్లాస్టిక్, సిరామిక్ కుండీలు, చెక్క పెట్టెలు, మట్టి కుండలు… ఇలా ఏదయినా వాడుకోవచ్చు. నీళ్లు బయటకు వెళ్లకపోతే మొక్క త్వరగా చనిపోతుంది కాబట్టి వాటికి రంధ్రాలు ఉండాలి. మొక్క పెరిగే కొద్దీ కుండీ బరువూ ఎక్కువవుతున్నప్పుడు గొలుసులు, తాడుతో వాటికి ఊతమివ్వాలి. మొక్కను ఇసుక లేదా పెర్లైట్లో పెంచాలా అనేది నిర్ణయించుకోవాలి. దీనివల్ల వేర్లకు గాలి అంది బాగా పెరుగుతాయి. తేమా చక్కగా అందుతుంది. పద్ధతి ప్రకారం రెండు వంతుల పీట్ మాస్ ఒక్కో వంతు చొప్పున ఇసుక, పెర్లైట్ వాడాలి. ద్రవరూప ఎరువులు వాడితే మేలైన ఫలితాలు ఉంటాయి. పిచికారి చేయడం కన్నా మొక్కలు నాటేముందు మట్టిలో ఎరువులు కలపడం మేలు. మొక్కలన్నింటినీ కుండీల్లో నాటాకే అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి. 10-14 అంగుళాల వ్యాసార్థం ఉన్న కుండీలను ఎంచుకోవాలి. వీటిలో ఒక్కోదానిలో మూడు మొక్కలను నాటుకోవచ్చు.
* మొక్కలకు ప్రతిరోజూ నీరు పోయాలి. మట్టి మిశ్రమం పైభాగం నుంచి 25 శాతం తేమను కోల్పోయినప్పుడు నీటిని పిచికారి చేయాలి. వారానికోసారి ద్రవరూప ఎరువులను అందించాలి. ఎత్తుగా పెరిగిన వాటిని ఆకృతి ప్రకారం కత్తిరించుకోవాలి. మొక్క నాటే ముందు మట్టిని, పరికరాలను స్టెరిలైజ్ చేయాలి లేదా 1 : 10 నిష్పత్తిలో తయారుచేసిన క్లోరిన్ నీటితో తడపాలి. వాటి వేళ్లు ఉండల్లా చుట్టుకుపోతే బయటకు తీసి సరిచేసి మళ్లీ నాటాలి. కొత్తగా నాటిన మొక్కల్ని నాలుగైదు వారాల వరకు నేరుగా సూర్యరశ్మిలో ఉంచి తరువాత అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి.
* ఏ మొక్కలంటే: పూల మొక్కల్లో అబూటిలాన్ మెగా పొలిమికమ్, అలమంద, బిగోనియా (వేలాడే రకాలు), వేలాడే చామంతి, వేలాడే పెటూనియా, క్లైయాంథస్, బాల్సమ్, తలంబ్రాల మొక్క, ఫ్లెమ్ వాయిలెట్, కంప్యానులా, లిప్స్టిక్ మొక్కలు అనుకూలం. ఆకుల మొక్కల్లో కొలియస్, ఫిలోడెండ్రాన్, పొతీస్, స్పైడర్ ప్లాంట్, ఫన్స్, జెబ్రినా, ఆస్పరాగస్, కంగారో వైన్, త్రేసిస్ కాన్షియా ఎంచుకోవాలి.