DailyDose

కేసీఆర్ మంత్రి వర్గం మార్పులపై ఊహాగానాలు-రాజకీయ–08/31

కేసీఆర్ మంత్రి వర్గం మార్పులపై ఊహాగానాలు-రాజకీయ–08/31

*తెలంగాణలో కొద్ది రోజులుగా ప్రతిప‌క్షంలో కంటే అధికార పార్టీలోనే రాజ‌కీయం రంజుగా మారింది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి బంప‌ర్ మెజారిటితో అధికారంలోకి వ‌చ్చిన గులాబీ పార్టీ… వ‌రుస చేరిక‌ల‌తో తిరుగులేని శ‌క్తిగా మారింది. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక టీఆర్‌ఎస్‌లో అంతు చిక్కని రాజకీయం నడుస్తోంది. ఎన్నిక‌లు జ‌రిగిన వెంట‌నే కేటీఆర్‌కు ప‌గ్గాలు అప్పగిస్తార‌ని ప్రచారం జ‌రిగింది. కానీ వర్కింగ్‌ ప్రెసిండెట్‌గా నియమించారు. కేబినెట్‌ విస్తరణ కూడా ట్విస్టులతో నడిచింది. సీనియ‌ర్లు, మాజీ మంత్రులకు అతి కొద్దిమందికే అవ‌కాశాలు ద‌క్కాయి. రాను రాను సీనియర్లకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో న‌లుగురు మంత్రులు ఓడిపోగా.. నాయిని, క‌డియం లాంటి వారిని ప‌క్కకు పెట్టారు. ల‌క్ష్మారెడ్డికీ అవ‌కాశం ద‌క్కలేదు. సీనియ‌ర్ లీడ‌ర్ హ‌రీష్ రావును ప‌క్కన పెట్టడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చ. పోచారంని స్పీక‌ర్‌గా, ప‌ద్మారావును డిప్యూటీ స్పీక‌ర్‌గా చేసి సైలెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరుగా సీనియ‌ర్లు, మాజీ మంత్రులు పార్టీలో ఉంటూనే అప్రాధాన్యంగా మారిపోయారు.
*స్టాలిన్‌ అడుగు గట్టిదే
‘‘నేను కరుణానిధిని కాను. కానీ నా తండ్రిలా మారేందుకు ప్రయత్నించే దమ్ము, ధైర్యం నాకున్నాయి’’ ఇదీ.. డీఎంకే అధిపతి స్టాలిన్‌ ఉద్వేగ పూరితంగా చేసిన తొలి ప్రసంగం. ఇదే ప్రసంగం… ఎనిమిదేళ్లుగా విజయదాహంతో పరితపిస్తున్న డీఎంకేని ఆయన గెలుపు తీరాలకు చేర్చేలా చేసింది. కరుణానిధి స్థానంలో డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టినప్పడు ఎం.కె.స్టాలిన్‌ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా? అన్న రాజకీయ వర్గాల గుసగుసలకు స్వస్తిపలుకుతూ… పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొనడానికి స్టాలిన్‌కి 2019 సార్వత్రిక ఎన్నికలు మంచి అవకాశాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకొని విజయదుంధుభి మోగించి, తమిళ ప్రజల్లో కలైంజర్‌ కరుణానిధికి తగ్గ వారసుడన్న ముద్ర వేయటంలో స్టాలిన్‌ కృతకృత్యులయ్యారు. నిజానికి ప్రారంభంలో స్టాలిన్‌ సోదరుడు ఎంకే అళగిరి సైతం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సోదరులిద్దరినీ విభజించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ తమిళనాట అడుగుపెట్టే ప్రయత్నాలు జోరుగానే చేసింది. ఇదంతా చూసి… అళగిరితో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకొని ద్రవిడ భూమిలో పాదం మోపాలన్న బీజేపీ ప్రయత్నాన్ని స్టాలిన్‌ చిత్తుచేయగలిగారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను అత్యంత సమర్థవంతంగా భర్తీ చేసిన స్టాలిన్‌ అతి కొద్దికాలంలోనే తమిళ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు.
* కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని : భట్టి
‘ప్రజల్ని మోసం చేస్తూ దోపిడీ చేస్తున్న సన్నాసివి నువ్వు. రోజుకో మాట, పూటకో మాట చెప్పే దద్దమ్మవు. రాష్ట్రానికి శనిలా దాపురించావు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టిన వాళ్లు సన్నాసులా? లేక కాళేశ్వరం రీ డిజైన్‌ పేరుతో రూ. 80 వేల కోట్లు ఖర్చు పెట్టి చుక్క నీరు కూడా ఇవ్వని నువ్వు సన్నాసివా?’ అంటూ కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ‘గోదావరిలో వరదొచ్చి నీళ్లొచ్చినా నీ పనితనమే అంటివి’ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో శుక్రవారం భట్టి మాట్లాడారు. ‘తలకాయ ఉన్న వాడెవడైనా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటాడు. జీరో నుంచి 3 శాతం వడ్డీకి రుణాలిచ్చే ఆర్థిక సంస్థలుండగా కేసీఆర్‌ మాత్రం కమర్షియల్‌ బ్యాంకుల నుంచి 11 శాతం వడ్డీకి రూ. లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు’ అని ఆరోపించారు. ‘కాళేశ్వరం కోసం రూ. లక్ష కోట్లు, మిషన్‌ భగీరథ కోసం రూ. యాభై వేల కోట్ల అప్పులు తీసుకున్నారు. వేరే అప్పులు మరో రూ. లక్ష కోట్లున్నాయి. పదేళ్లలో ఈ రెండున్నర లక్షల కోట్లకు వడ్డీతో కలిపి రీ పేమెంట్‌ చేస్తే రూ. 5 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది’ అని అన్నారు.
*కేసీఆర్ అసమ్మతి సెగ ఆరంభం
తొలిసారి దాదాపు ఆరేళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో ఓ గొంతుక బహిరంగంగా బహిరంగ వేదికపై గళమెత్తింది. ‘మంత్రి పదవి నాకు ఎవరో వేసిన బిక్ష కాదు. గులాబీ జెండా ఓనర్లం మేం. పార్టీలోకి మధ్యలో వచ్చినోళ్ళం కాదు. అడుక్కుని వచ్చినోళ్ళం కాదు’ అంటూ తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో ఇంత వరకూ అణచిపెట్టుకున్న అసంతృప్తి జ్వాలల ఫలితమా?. లేక తెగింపా?. తొలి విస్తరణలో అసలు ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి వస్తుందో రాదో అన్న విషయంలోనూ చివరి వరకూ ఉత్కంఠే నడిచింది. కానీ చివరకు జాబితాలో ఆయన పేరు చేరింది. గత ఆరేళ్ళుగా పార్టీలో ఉండి కెసీఆర్ నిర్ణయాలను ప్రశ్నించటం కానీ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇప్పటివరకూ నోరెత్తిన వారు లేరు. అలాంటి సమయంలో ఈటెల వంటి సీనియర్ నేత ‘మంత్రి పదవి నాకు ఎవరో వేసిన బిక్ష కాదు’ అని వ్యాఖ్యానించారంటే దానర్ధం ఏంటి?. కెసీఆర్ విమర్శలను ఏ మాత్రం సహించరనే పేరుంది.
*మనోజ్‌ తివారిపై మండిపడ్డ మహిళా కాంగ్రెస్‌
అసోం తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌’ అసోం పౌర తుది జాబితా నేడు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్రమ వలసదారులు ఢిల్లీలో తిష్ట వేశారని.. వారి సంఖ్య రాజధానికి ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు
*దేశ జీడీపీ తగ్గుదల ఆందోళనకరం
దేశ జీడీపీ ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా తగ్గడం ఆందోళనకర పరిణామమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తాను ఆర్థికవేత్తను కానని, కానీ జీడీపీ మొదటి త్రైమాసికంలో 5.8% నుంచి 5 శాతానికి తగ్గిందన్న సమాచారంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిస్థాయి మాంద్యంగా మారే ప్రమాదం ఉందని, దీనిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద తగిన పరిష్కారాలు, సమాధానాలు, ఉపాయాలు ఉన్నాయా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని శుక్రవారం ఆయన ట్విటర్లో ప్రశ్నించారు.
*పాలమూరు’పై సీఎం చెప్పినవన్ని అబద్ధాలే: డీకే అరుణ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినవన్ని అబద్ధాలేనని భాజపా నేత డీకే అరుణ ధ్వజమెత్తారు. 11.20 లక్షల ఎకరాలకు సాగునీటిని మహబూబ్నగర్ జిల్లాలో అందించామంటూ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. భాజపా సొంత ఖర్చులతో బస్సుయాత్ర చేపడుతుందని.. ఏ ప్రాజెక్టు కింద ఎంత నీరిచ్చారో చూపాలని డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో చేపట్టిన నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టుల నిర్మాణం చివరిదశలో ఉందని, వాటిని పూర్తిచేయకుండా కేసీఆర్ విస్మరించారని విమర్శించారు.
*భువనగిరిలో కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం
స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఇందులో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎంపీని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎంపీ అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో వడపర్తి సర్పంచి ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలు విరిగింది. తొలుత జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ తర్వాత కొందరు కార్యకర్తలు పాత బస్టాండు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీసీసీ ఇన్ఛార్జి అధ్యక్షుడు అనిల్ కుమార్రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
*రేవంత్ హద్దు మీరి మాట్లాడారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ట్రాన్స్కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్రావుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని, దిగజారి మాట్లాడుతున్నారని దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఒక అధికారిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన రేవంత్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్రావుతో కలిసి శుక్రవారం తెలంగాణభవన్లో ఆయన మాట్లాడారు.
*తవ్వకాలకు అనుమతులు రద్దు చేయండి:కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేల వినతి
అమ్రాబాద్ అభయారణ్యంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) అదనపు డైరెక్టర్ జనరల్ అనూప్కుమార్ నాయక్కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ (అచ్చంపేట), సంపత్కుమార్ (అలంపూర్), వంశీచంద్రెడ్డి (కల్వకుర్తి) విజ్ఞప్తి చేశారు. దిల్లీలో శుక్రవారం ఏడీజీని వారు కలిశారు. యురేనియం తవ్వకాలు చేపట్టాలనుకుంటున్న అభయారణ్యంలో 20 పెద్ద పులులు మనుగడ సాగిస్తున్నాయని వివరించారు.
*అవినీతి నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు: నాగం
ప్రాజెక్టులలో జరిగిన అవినీతి నుంచి సీఎం కేసీఆర్ తప్పించుకోలేరని మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడిన ఎందరో ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. ప్రభుత్వం మారిన మరుక్షణం కేసీఆర్, మంత్రులు, సహకరించిన అధికారులకూ అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.
*మంత్రి ఈటల నివాసం వద్ద సందడి
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటి వద్ద శుక్రవారం అభిమానులు, పార్టీ కార్యకర్తల సందడి నెలకొంది. గురువారం హుజూరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్న నేపథ్యంలో శామీర్పేటలోని ఈటల ఇంటి వద్దకు ఉదయం వివిధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి సన్నిహితులు వచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈటల చేసిన వ్యాఖ్యలు, తర్వాత వాటిపై ఆయన ఇచ్చిన స్పష్టతపై చర్చించారు. పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మానకొండూరు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంత్రితో కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు.
*రిజర్వేషన్లపై పునఃసమీక్ష అవసరమే: మంద కృష్ణమాదిగ
రిజర్వేషన్లను తిరిగి సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రిజర్వేషన్లను సమీక్షించడమంటే అది వర్గీకరణే అని స్పష్టం చేశారు. భగవత్ వ్యాఖ్యలు రిజర్వేషన్లకు వ్యతిరేకమని తాము భావించడంలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రప్రభుత్వాన్ని తప్పుపడుతూ..ఎన్నింటినో సుసాధ్యం చేశామంటున్న ప్రధాని మోదీ..అదే కోవలో వర్గీకరణ ఎందుకు సాధ్యంకావడం లేదన్నది వివరించాలన్నారు.
*నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాలను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. వరంగల్లోని సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని నిజామాబాద్కు తరలించాలనే యోచన మానుకోవాలని సూచిస్తూ శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. ‘‘2008లో నేను ఎంపీగా ఉన్నప్పుడు వరంగల్లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయించాను.
*ఆదాయం రాదనే తెదేపా నేతల రాద్ధాంతం: బొత్స
ఇసుకపై వచ్చే ఆదాయం ఇప్పుడు రాదనే ఆక్రోశంతోనే తెదేపా నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక కోసం తెదేపా నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమన్నారు. ఇసుకపై వారి దోపిడీ ఎలా సాగిందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. వారిలా తమ పార్టీ దోపిడీ చేయలేదని చెప్పారు. సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.
*రాజధానిపై స్పష్టతనీయని బొత్స: సోమిరెడ్డి
‘రాజధాని అమరావతిపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏమిటా..అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆయన మళ్లీ మంత్రి బొత్స సత్యనారాయణతోనే మాట్లాడించారు. బొత్స ఏమి మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. అనువాదం చేయించుకుని విందామన్నా ఆయన మాటలు అర్థం కావు’.. అని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. – ఇసుక ధర ఇంతగా పెరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రశ్నించారు.
*ఆదాయం రాదనే తెదేపా నేతల రాద్ధాంతం: బొత్స
ఇసుకపై వచ్చే ఆదాయం ఇప్పుడు రాదనే ఆక్రోశంతోనే తెదేపా నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక కోసం తెదేపా నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమన్నారు. ఇసుకపై వారి దోపిడీ ఎలా సాగిందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. వారిలా తమ పార్టీ దోపిడీ చేయలేదని చెప్పారు. సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.
*తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరూ పార్టీకి దూరం అవుతున్నారు. ప్రత్తిపాడు ఇన్ ఛార్జ్ వరుపుల రాజా పార్టీకి రాజీనామా చేయగా.. మరో ఇద్దరు నేతలు సైతం అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు టీడీపీ అధినాయకత్వం మీద ఎన్నికల సమయం నుండి ఆవేదనతో ఉన్నారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగినా..ఆయన టీడీపీ నుండే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.అయితే, వైసీపీ నేతగా ఉన్న ఆమంచి క్రిష్ణ మోహన్ ను ఆయన్ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అదే విధంగా వైసీపీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉంటూ టీడీపీలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ సైతం పార్టీ వీడుతారని ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన వైసీపీలోకి రావాలని భావించినా..ముఖ్యమంత్రి ఆయనకు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. ఇదే విధంగా మరి కొందరు టీడీపీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.
* ఇరుక్కున్న ఇమ్రాన్ చేయగలిగింది ఇంతే..
‘కాశ్మీర్కోసం ఎంతకైనా తెగిస్తాం’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనడాన్ని ఇండియా సహా ఇరుగు పొరుగు దేశాలన్నీ లైట్గా తీసుకున్నాయి. కాశ్మీర్ ప్రాంతం మీది ఎప్పుడయ్యిందో చెప్పమని ఇండియా గట్టిగా అడిగేసరికి నోరు బందయ్యింది. ఇంతకీ, ఇమ్రాన్ మాటలు సహజంగా వచ్చాయా, లేక సైన్యం స్క్రిప్ట్ని ఆయన చదివారా అనే అనుమానాలు వచ్చాయి. నిస్సందేహంగా అవి పాక్ మిలిటరీ మాటలే! దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినందున… ఇండియా బూచిని చూపించి పబ్బం గడుపుకోవాలని భావిస్తోంది.బాగు పడాలంటే అప్పు చేయాలి, లేదా యుద్ధం చేయాలి అనే ఫార్ములాతోనే పాకిస్థాన్ సాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ శాంతి, సుస్థిరత కోరుకుంటున్నందున ఇప్పటికిప్పుడు అప్పులిచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. ఇరుగుపొరుగు దేశాలలో రక్తం పారిస్తున్న మిలిటెంట్ సంస్థలు పాక్లోనే తలదాచుకుంటున్నాయని సాక్ష్యాలతో రుజువైంది. సైన్యం మద్దతుతో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది. అధ్వాన్నంగా మారిన ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని చక్కబెట్టడమే ఆయన ఫస్ట్ టార్గెట్. స్వతహాగా క్రికెటర్ కావడం, నాన్–కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్ కావడం, పూర్తిగా వెస్ట్రన్ లైఫ్స్టయిల్తో ఉండడం ఇమ్రాన్ ప్రత్యేకతలు. ఆయన అధికారంలోకి వచ్చాక, ఆ తర్వాతకూడా ఇండియాపై పెద్దగా వ్యతిరేకత చూపలేదు. అయితే, రానురాను సైన్యం వత్తిడి పెరగసాగింది.ఇండియాని బూచిగా చూపించకపోతే పాక్లో సైన్యానికి మనుగడ ఉండదు. పుల్వామాలో మిలిటెంట్ దాడితో ఇండియా వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది. ఇకపైనా మిలిటెన్సీ విషయంలోనూ, దానిని ఎంకరేజ్ చేస్తున్న దేశం విషయంలోనూ మునుపటిలా ఊరుకునేది లేదన్న సంకేతాన్ని స్పష్టంగా పంపించింది. మొట్టమొదట పాక్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి తొలగించింది. అక్కడి వస్తువు దిగుమతిపై కొన్ని కట్టుబాట్లు పెట్టింది. ఇక్కడి నుంచి వెళ్లే ఎగుమతులపై సుంకాన్ని పెంచింది. కాశ్మీర్లో అమలవుతున్న ఆర్టికల్–370ని రద్దు చేసేసింది. ఇవన్నీ పాక్ ఆర్థిక మూలాలను కుదిపేశాయి.అక్కడ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థనుసైతం సైన్యమే నడిపిస్తుంది. ప్రధానమంత్రి ఎవరయినా సైనిక ప్రయోజనాలే ముఖ్యం. ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ చీఫ్గా ఉన్న పిటిఐకి పాకిస్థాన్‌‌ సైన్యం, గూఢచారి సంస్థ ఐఎస్‌‌ఐతో పాటు అక్కడి మిలిటెంట్ నెట్‌‌వర్క్‌‌కూడా గట్టి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యం. ఇమ్రాన్‌‌ ఏం మాట్లాడాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిలిటరీ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకోవలసిందే.
* తెలంగాణ భాజపాలో విభేదాలు – రేవంత్
ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ సంస్థలను దివాళా తీయించి దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ సీఎండీలుగా నియమిస్తారని, కానీ కేసీఆర్‌ మాత్రం వారిని తొలగించి పదవీ విరమణ చేసిన వారిని సీఎండీలుగా చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసుకుంటున్న అడ్డగోలు ఒప్పందాలపై ఐఏఎస్‌లు సంతకాలు పెట్టకపోవడంతోనే వారిని తొలగించి రిటైర్‌ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభాకర్‌ రావు, గోపాలరావు లాంటి వారిని సీఎండీలుగా నియమించారని అన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్‌ సంస్థలు 74 వేల కోట్లు అప్పులు తెస్తే.. కేవలం 35 కోట్లు మాత్రమే తెచ్చామని సీఎండీ ప్రభాకర్‌ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్‌ రావు దీనిపై వివరాలు బయటపెట్టాలని రేవంత్‌ సవాల్‌ చేశారు. ప్రభాకర్‌ రావు ఏదో నీతిమంతుడు అయినట్లు కొంతమంది చెంచాలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దోపిడియే లేకుంటే ప్రభుత్వం ఆధీనంలోని సంస్థల విద్యుత్‌ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతోందని నిలదీస్తే.. ఉద్యోగులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌ రావును విద్యుత్ సంస్థల సీఎండీగా నియమించడానికి అర్హతే లేదన్నారు. అర్హత లేని ప్రభాకర్‌ రావు కింద పని చేయలేక సమర్థవంతమైన ఐఏఎస్‌లు బదిలీలు చేయించుకొని వెళ్లిపోతున్నారన్నారు.కరెన్సీ కట్టల కోసం కేసీఆర్‌ విద్యుత్‌ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని రేవంత్‌ మండిపడ్డారు. విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేత రఘు మీద నిషేధం విధించినప్పుడు మాట్లాడని సంఘాల నేతలు నిన్న ఎందుకు రోడెక్కి ధర్నాలు చేశారని ప్రశ్నించారు. చెన్నూరులో ఒక అధికారి కేసీఆర్‌, కేటీఆర్‌ మీద మాట్లాడితే చర్యలు తీసుకున్నారు.. మరి నా గురించి ఇంత మంది ఉద్యోగులు మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకే తాను మొక్కలు అని ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అంటున్నారని, ఏ తేదిలోపు చేయిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కేసీఆర్‌కు వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయిందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఆపార్టీలో స్థానం లేదని రేవంత్‌ వ్యాఖ్యానించారు.