ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని చెబుతూ సంచలన నివేదికను వెల్లడించింది. అయితే జీడీపీ పడిపోవడం వల్ల నష్టపోయేది దేశంలోని పేద ప్రజలే అని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ పడిపోయిన ప్రతి సందర్భంలోనూ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక వ్యక్తి సగటు ఆదాయంపై కూడా ప్రభావం చూపడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు.2018- 19 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నెలవారీ తలసరి ఆదాయం రూ.10,534 ఉంటే… వార్షిక జీడీపీ 5శాతం వృద్ధిలోకి వచ్చిందంటే 2020 ఆర్థిక సంవత్సరానికి నెలవారి తలసరి ఆదాయం రూ. 526 పెరుగుతుందని ఇందిరాగాంధీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో ఎకానామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్. నాగరాజ్ తెలిపారు. ఇలా కాకుండా నెలవారీ తలసరి ఆదాయం 4శాతం పెరిగితే.. ఇక ఆదాయం రూ. 421కి చేరుకుంటుందని చెప్పారు. అంటే వృద్ధి రేటులో ఒక శాతం తగ్గినా ఆ ప్రభావం నెలవారి తలసరి ఆదాయంపై పడుతుందని స్పష్టమవుతోందని చెప్పారు నాగరాజు. మరోలా చెప్పాలంటే 5శాతం ఉన్న జీడీపీ 4శాతానికి పడిపోతే నెలవారీ తలసరి ఆదాయం రూ.105 తగ్గుతుందని ఉదహరించారు.ఇక ఏడాది లెక్కన చూస్తే ఒక వ్యక్తికి రూ. 1260 నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఇక ప్రతి త్రైమాసికంలో జీడీపీ తగ్గుతూ వస్తోందని చెప్పిన నాగరాజు… ఈ ఏడాది ఏప్రిల్-జూన్ నాటికి అది 5శాతానికి చేరుకోవడం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఇక 2020 ఆర్థిక సంవత్సరానికి గత ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా 6.7శాతం ఉంటుందని అంచనా వేసింది ఆర్బీఐ. అంతకుముందు 7.3శాతంగా ఉంటుందని అంచనా వేసింది.ఇక జీడీపీ తగ్గుతూ వస్తోందంటే సామాన్య మనిషి తలసరి ఆదాయంపై ప్రభావం చూపుతుందని నాగరాజు చెబుతున్నారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత పాటించనందు వల్ల ఆ ప్రభావం ఎక్కువగా పేద ప్రజలపై పడుతుందని చెప్పారు. దీని వల్ల దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు నాగరాజు. అంతేకాదు జీడీపీ రేటు పడిపోవడం అంటే… ఉద్యోగావకాశాలు కూడా తగ్గిపోతాయని ఆయన వివరించారు.
GDP పడిపోతే ఎవరికి నష్టం?
Related tags :