అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు దుండగులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. 21మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారి సంఖ్య 7కు చేరగా గాయపడిన వారిలో ఓ ఏడు నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. గాయపడిన వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఓ ముష్కరుడిని మట్టుబెట్టారు. ప్రస్తుతానికి సాయుధులైన ముష్కరులు ఎవరూ ఘటనా ప్రాంతంలో లేరని తెలిపారు. టొయోటా వాహనంలో వచ్చిన దుండగులు తొలుత యూఎస్ పోస్టల్ సర్వీస్ వ్యాన్‌ని దొంగిలించారు. అనంతరం అదే వ్యాన్‌లో ఘటనా స్థలానికి చేరుకొని సామాన్య పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు అధికారులు అందించారన్నారు. దీనిపై ఎఫ్‌బీఐతో పాటు ఇతర భద్రతాధికారులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. అలాగే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఈ ఘాతుకాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. స్థానికంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి అధికార యంత్రాంగం నిమగ్నమయిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి దుశ్చర్యలను టెక్సాస్ ప్రజలు ఐక్యంగా, సమర్థంగా ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు.
టెక్సాస్ కాల్పుల్లో గాయపడిన పదిహేడు నెలల చిన్నారి
Related tags :