Health

చిన్నారుల BMI 5ఏళ్ల నుండి కొలవాలి

Kids BMI Must Be Measured From Fifth Year Itself

పాలు తాగరు… గుడ్డు తినరు… పెరుగన్నం అసలే ముట్టరు… పిల్లల ఆహారం విషయంలో చాలామంది తల్లులు ఇలాంటి ఫిర్యాదులే చేస్తారు. వాళ్లు ఇష్టపడే జంక్‌ఫుడ్‌ని తగ్గించి, బలవర్థకమైన ఆహారంపై ఆసక్తి పెంచాలంటే… మన వంతుగా ఏం చేయాలో చూద్దాం.
ఒకప్పుడు చిన్నారులకు ఆరునెలలు వస్తే… బియ్యపురవ్వ లేదా అన్నం, పప్పుల్ని మెత్తగా ఉడికించి.. ఉప్పు, నెయ్యి వేసి తినిపించేవారు. కుదిరితే కూరగాయలు, పండ్ల గుజ్జునీ పెట్టేవారు. క్రమంగా గుడ్డు, పండ్లు, పాలు అలవాటు చేసేవారు. వీటితో వారి శారీరక, మానసిక ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను అందించేవి. ఇప్పుడు అలాంటివన్నీ తగ్గిపోయి చిప్స్‌, చాక్లెట్లు, నిల్వ ఆహారాన్నే పిల్లలు ఇష్టపడుతున్నారు. ఈ పదార్థాలే ఊబకాయం మొదలు, చిన్నవయసులోనే మధుమేహం, అధికరక్తపోటు, గుండెజబ్బులు ఇతర సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. బరువు పెరిగేకొద్దీ బద్ధకం ఆవరించి, చురుకుదనం లోపిస్తుంది. చదువు మొదలు, ఇతర ఆటల్లోనూ పిల్లలు వెనుకబడిపోతారు.

పిల్లలకు ఎదిగేకొద్దీ అన్నిరకాల పోషకాలు సమతూకంలో కావాలి. అవన్నీ ఇంటి ఆహారం నుంచే ఎక్కువగా అందుతాయి. అలా కాకుండా చిప్స్‌, బేకరీ పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఆహారం తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే ఉప్పు, మసాలాలు, ఇతర రసాయనాలు చిన్నారుల మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అవసరానికి మించి పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో అధికకొవ్వు పేరుకుపోతుంది. పోషకాహార లేమి మొదలవుతుంది. ఈ సమస్యను అదుపులో ఉంచే బాధ్యత పెద్దవాళ్లదే.

చాలా తక్కువ మొత్తంలో చిన్నారులకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. రోజూ పిల్లలకు అందించే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఏ మేరకు ఉండాలి… ఏయే వయసుల వారికి ఇవి ఎంత మొత్తంలో అవసరం అనేది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఇనుము, జింక్‌, క్యాల్షియం, అయోడిన్‌, విటమిన్‌ ఎ, బి, సి వీటిలో ముఖ్యమైనవి. గర్భంతో ఉన్నప్పటి నుంచే ఈ పోషకాలు తల్లి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకూ అవన్నీ అందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారుల్లో… ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక సూక్ష్మ పోషకానికి దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. భారత్‌లో ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లల్లో సూక్ష్మపోషకాహార లోపం ఎక్కువగా ఉన్నట్లు యూనిసెఫ్‌ నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ గమనించుకుంటూ… తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే…

* చిన్నారులకు ఊహ తెలిసే వయసు వచ్చినప్పటి నుంచే పోషకాహారం అలవాటు చేయాలి. ఏ పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయి… అవి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు వివరించాలి. మొదటినుంచే పోషకాహారం అలవాటు చేస్తే… బయటి పదార్థాలపై ఆసక్తి చూపించరు.
* గ్లాసు పాలు, ఉడికించిన గుడ్డు, ఒక అరటిపండు.. రోజూ తీసుకునేలా చేస్తే క్యాల్షియం, మాంసకృత్తులు మొదలు ఎన్నో పోషకాలు వాళ్లకు చేరతాయి. కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌ పెట్టాలి. వాటివల్ల కలిగే లాభాలూ పిల్లలకు తరచూ వివరించాలి. ఎలాంటి పోషకాహారమైనా రుచిగా, కంటికింపుగా వండాలి.
* ఐదేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి నెలకోసారి పిల్లల బీఎమ్‌ఐ(బాడీ మాస్‌ ఇండెక్స్‌) కొలవాలి. ఎత్తు బరువుల నిష్పత్తి నిర్దేశించిన మేరకన్నా ఎక్కువ లేదా తక్కువ ఉన్నా ప్రమాదమే. బీఎమ్‌ఐని బట్టి వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో వైద్యులు సూచిస్తారు.
* ప్లేట్లను అన్ని పదార్థాలతో నింపేసి.. దేన్నీ వదలకుండా తినాలనే నియమం పెడతారు కొంతమంది తల్లులు. ఇది మంచి పద్ధతి కాదు. వారికి ఏమేం ఇష్టమో అడిగి, వాటినే వండటానికి ప్రాధాన్యమివ్వాలి. వండే సమయంలో వాళ్ల సాయమూ తీసుకోవాలి. వంటలో తమ పాత్ర ఉందనే భావన వస్తే తినడానికి ఆసక్తి చూపుతారు.