అమ్మ, నాన్న – స్వార్థపు అమెరికా పిల్లలు
(ఈ కథ సగటు తెలుగు తల్లిదండ్రుల పరిస్థితిని ప్రతిబింబింపజేసేది. చాలా మంది అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటున్నారు. లేని మిగితావారిని ఉద్దేశించినది మాత్రమే)
?కనువిప్పు?
అమ్మా! నేనే. పదహరో తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాదు వస్తోంది. దానితో రెండు మూడు రకాల పొడులు, నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్లిన పట్టుచీరలు, పుల్లారెడ్డి స్వీట్స్ పంపించు. వాళ్లు సైదాబాదులో ఉంటారు. నాన్నను వెళ్లి ఇచ్చి రమ్మను. నేను వచ్చేటప్పుడు వాళ్ళకు బోలెడు వస్తువులు తెచ్చాను….”
మొదలయ్యింది పొద్దునే కృష్ణవేణికి కూతురు స్రవంతి నుండి ఈ “ఇండియా-అమెరికా”ల మధ్య సరఫరా చర్చలు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రతి ఏడాది, రెండు మూడు సార్లు జరిగే తంతు ఇది.
“వేణీ! ఆలోచించు! తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కానీ, అది ఇలా ఉండకూడదే. ఏ వస్తువులు అవసరమో అనవసరమో, ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్లకు మన జీవితాన్ని అందించాలన్న తపనలో తప్పటడుగులు వేస్తున్నాము”…అన్నాడు భర్త వేంకటేశ్వరరావు.
“చాల్లే ఊరుకోండీ! పిల్ల అంత దూరంలో ఉంది. ఒక అచ్చటా-ముచ్చటా లేదు. పాపం ఎంత కష్టపడుతోందో అక్కడ. ఇంత మాత్రం మనం భరించలేమా? కన్న తల్లిదండ్రులుగా…”
“వేణీ! ఖర్చులు నువ్వు లెక్క రాయవు. కానీ, నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు”..
“మీరు మీ పిచ్చి మాటలు…ఆపండి”.
రెండు వారాలకు తల్లికి స్రవంతి ఫోన్. “అమ్మా! నాకు రెండో నెల. నవంబర్ నెలాఖరులో డెలివరీ. నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను. మా అయన టికెట్ బుక్ చేస్తాడు. నాన్నను ఇన్ష్యూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని, ఆరునెలలకు సరిపడా మందులు, నాకు, పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకు రావాలి. నాన్నకు టికెట్ పెట్టలేను. ఒక ఆరునెలలు ఆయనను చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు”. …
ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరో పక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తనను ఒక్కదానినే రమ్మని చెప్పటం, మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది. తేరుకొని, “ఏవండీ, విన్నారుగా. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నాకోసం”…
బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు కృష్ణవేణికి ఉన్న వ్యాధులు. మందులతో, ఎక్సర్సైజుతో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్లు నొప్పులు వస్తాయి. పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో. చిన్న కూతురు శ్రావణి హైదరబాదులో ఇటీవలే వివాహం అయ్యింది. ఆంధ్రాబ్యాంకులో పని చేసి స్రవంతి పెళ్లి కాగానే ఐదేళ్లముందే వాలటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి. భర్త వేంకటేశ్వరరావు ఎస్బీఐలో సర్వీసు చేసి రిటైర్ అవ్వబోతున్నాడు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము, కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. నిజం చెప్పాలంటే ఇంక పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు, నెల నెలా వచ్చే పింఛను తప్ప. ఇంటి అద్దె లాంటి ఖర్చులు లెవు కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్తపరులే.
“శ్రావణీ! అక్క అమెరికాకు నన్నొక్కదాన్నే రమ్మంటోంది. నాన్న ఒక్కరూ ఉండటం కష్టం, మంచిది కాదు. మరి నీ దగ్గర….”.
“అమ్మా! నాకు అత్తగారితోనే సరిపొతోంది. ఆఫీసు, ఇల్లు, అత్త గారు…ఇంక నాన్న కూడానా…అందులో నాన్న అది కరెక్టు కాదు ఇది కరెక్టు కాదు అని కామెంట్స్ చేస్తుంటారు. ఈయనకు అవి ఇష్టం ఉండదు. సర్దిచెప్పే ఓపిక, సమయం నాకు లేదు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకు తీసుకువెళ్ళండి…”.
అవాక్కయ్యింది కృష్ణవేణి. “ఎంత కష్టపడి పెంచాము పిల్లల్ని? ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావలసినంత స్వేచ్ఛనిచ్చి, మంచి చదువులు చదివించి పెళ్లిళ్లు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని, స్వార్థాన్ని వాళ్లు ఎలా చూసుకుంటున్నారు” అని నిర్ఘాంతపోయింది. భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధమాడింది.
“ఏవండీ! మీరు రాకుండా నేను ఆరు నెలలు ఉండలేను. స్రవంతికి ఎన్ని డబ్బు ఇబ్బందులున్నాయో అల్లుడు ఏమంటున్నాడో! కాబట్టి నా గ్రాట్యూటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను. ఇద్దరం కలిసే వెళదాము…”
“వేణీ! ఇలా ప్రతి దానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏమి మిగులుతాయి? నేను ఒక్కడినే ఉంటాను. శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు వంట వచ్చు, పనిమనిషి ఉంటుంది…”
“ఏవండీ! మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు. మీరు రావలసిందే. ఇది నా నిర్ణయం”. లక్ష రూపాయలు గ్రాట్యూటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహా…వేంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
ప్రయాణానికి రెండు నెలల ముందు నుండి స్రవంతి ఫోన్లలో ఆర్డర్లు. అమ్మా ఆ ఘాగ్రా చోళీ, ఫలానా పట్టు చీరా, శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు..డబ్బు మాత్రం వేణి-వేంకటేశ్వరరావు దంపతుల జేబులోవే. దాదాపుగా ఈ దుబారా ఖర్చులు యాభైవేలకు పైగానే.
“సార్! అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరూ ఎక్జిక్యూటివ్ మాష్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇవి కాకుండా గుండెకు, కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి” ఈ దంపతుల ఫిజీషియన్ దాక్టర్ శ్రీధర్ సలహా. తప్పదు కదా అని బిల్లు కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎంత అని అడిగారు. రెండు నిమిషాలలో టక టక కంప్యూటర్లో అన్నిటికీ లెక్కవేసి “మొత్తం పరీక్షలాకు 40 వేలు అవుతుందండీ! ” అని బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు. వేంకటేశ్వరరావుకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎక్కడినుండి తేవాలి ఇంత డబ్బులు, ఎందుకింత ఖర్చు ఇప్పుడు….వెను దిరిగి ఇంటికి వెళ్లారు దంపతులు.
“అమ్మా స్రవంతీ! మా హెల్త్ చెకప్‌కు 40 వేలు అవుతుందిట. మేము ఏమీ చేయించుకోము. రోజూ వేసుకునే మందులే ఆర్నెలలకు తెచ్చుకుంటాము..చాలదా”.
“నాన్నా! మీకు అర్థం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే, ఇన్షూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి. మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విజిటర్ ఇన్షూరెన్స్‌లో కవర్ అవ్వవు…మీరు పరీక్షలు చేయించుకుని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెల్చుకోవాల్సిందే…”
కూతురి కర్కశత్వం విని వేంకటేశ్వరరావు దిగులు పడ్డాడు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించారు. భగవంతుని దయ వలన ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు. ఆరునెలలకు సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ల నొప్పులు, విరేచనాలు, వాంతులు, తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతీ మందుల ఖర్చు పదిహేను వేలు. ఇవి కాక కూతురికి, పుట్టబోయే బిడ్డకు హోమియోపతీ మందుల ఖర్చు మరో ఐదువేలు…తడిసి మోపెడు. భార్యా భర్తలు ఈ అపరిమితమైన, అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు.
ప్రయాణం వారం రెండురోజుల్లోకి వచ్చింది. విమానంలో ఎకానమీ క్లాసు టికెట్టుతో ఒక్కరికి నలభై ఆరు కేజీల బరువు మాత్రమే తీసుకు వెళ్లవచ్చు. దంపతుల బట్టలు, అప్పటికి కొన్న సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికీ యాభై కేజీలు దాటాయి. తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం,తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూట్కేసుల బరువు సరి చేశారు. వెళ్లేముందు రోజు రాత్రి స్రవంతి అత్తగారినుండి ఫోన్. “వదినగారూ! నేను మర్చిపోయాను. మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. రెండు కేజీలు అవి, వాడికి, అమ్మాయికి బట్టలు, అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను..పట్టుకెళ్లండి”. వియ్యపరాలు కావటంతో మొహమాటపడి అలాగే అంది కృష్ణవేణి.
“వేణీ! మన చెకిన్ లగేజీ నిండింది. ఎక్కడ పెడతావు ఇవి? ఏవండీ! హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం. బాగుండదు అల్లుడు, వియ్యాలవారు ఏమైనా అనుకుంటారు…” ఏడు కేజీల హ్యాండ్ లగేజీలో వియ్యాలవారి వస్తువులు పట్టించే సరికి అవి కూడా నిండాయి.
అన్నీ సర్దుకొని, ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు. వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి,అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్లు గడ్డ కట్టుకుపోయేంత చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు. ఇక మొదలైంది వారికి నరకం.
స్రవంతి నిండు చూలాలు కావటంతో ఇంటిల్లిపాది వంట భారం వేణిపైనే పడింది. ఇవికాక రెండు పూటలా సింక్ నిండా అంట్లు, వారానికొకసారి ఇల్లు వాక్యూం క్లీనింగ్, బండెడు బట్టలు ఉతకటం…రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పని చేస్తోంది. మొదట్లో వేంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు. మెల్లమెల్లగా వేణిపై ఉన్న పనిభారం అర్థమయ్యింది. సహాయం చేయటం మొదలు పెట్టాడు. అంట్లు తోమటం, బట్టలు వాషర్ డ్రైయర్ లో వేయటం…..భారంగా రోజులు గడుస్తున్నాయి.
పిల్ల కానుపు అయ్యింది. బారసాల చేశారు. మొత్తం వంటా కృష్ణవేణే. దాదాపు యాభై మంది. ఆరోజు మొదలయ్యాయి ఆమెకు ఆరోగ్య సమస్యలు. విపరీతమైన మోకాళ్లనొప్పులు, మెడ, చేతుల నొప్పులు…గ్లాసు ఎత్త లేదు, అడుగు వేయలేదు. చంటి బిడ్డకు స్నానం చేయించాలి..కూతురికి సాయం చేయాలి..బండెడు పని ఇంట్లో. అతి కష్టం మీద ఎవ్వరికీ చెప్పకుండ ఒక నెల గడిపింది వేణి. తరువాత మెల్లగా స్రవంతికి చెప్పింది.
“స్రవంతీ! నాకు విపరీతమైన మెడనొప్పి, మోకాళ్లనొప్పులు వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ పని చేయటం లేదు. ఇక్కడ ఎవరైన దాక్టర్…”
స్రవంతి “అమ్మా! నేను ముందే చెప్పాను. ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడిలా అందుబాట్లో ఉండరు. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. కానీ, నువ్వు హైదరబాద్ డాక్టరుకు ఫోన్ చేసి కనుక్కో ఏమైనా మందులు చెబితే తెప్పిస్తాను”….
“స్రవంతీ! అవన్నీ అయిపోయాయి. డాక్టర్ ఫోన్లో చెప్పలేను అని అంటున్నారు. నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో…”
అతి కష్టం మీద మరో వారం తరువాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు 100 డాలర్లు. ఇన్షూరెన్సులో కవర్ అవ్వదు. తెచ్చుకున్న డాలర్లలో 100 ఇచ్చింది వేణి. “స్రవంతీ! యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అ వీక్. ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రెడ్యూస్, వి నీడ్ టు డు ఎ స్కాన్ ఆఫ్ హర్ నెక్ అండ్ నీస్. దే విల్ కాస్ట్ టు థౌసండ్ డాల్లర్స్. ఇన్షూరెన్స్ డస్నాట్ కవర్ దీస్. .” స్రవంతికి గుండెలో రాయి పడింది. రెండు వేల డాలర్లా అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకు వచ్చింది. ఒక వారం పాటు పని తనే చేసుకుంది. వేణి నొప్పులు తగ్గలేదు.
“నాన్నా! ఏం చేయను? రెండు వేల డాలరు పెట్టి పరీక్షలు చేయించే స్థోమత నాకు లేదు. మా ఆయన ఏవిటీ గోల అని విసుక్కుంటున్నారు. అమ్మ ఓర్చుకోవాల్సిందే. ఇంకా నాలుగు నెలలు ఉంది మీ ఆరు నెలలు పూర్తి అవ్వటానికి. నాకు బిడ్డ, మీ సాయం కావాలి..ఎలా”..
ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది. నొప్పులు తగ్గక పోగా మానసిక వత్తిడితో, చలి విపరీతం కావటంతో, అసలు వ్యాయామం లేకుండా, బయటకు వెళ్లలేని మంచు కురిసే సమయంలో రోగం మరింగ తీవ్రమయ్యింది. వేణి పూర్తిగా మంచాన పడింది.
వేంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. “అమ్మా స్రవంతీ! మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం. మేము వెంటనే ఇండియా వెళ్లిపోతున్నాము. టికెట్ మార్పించుకున్నాము. రేపు ఆదివారం మా ప్రయాణం.” అని తెగేసి చెప్పేశాడు. షాక్ తిన్నది స్రవంతి. అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది.
మొహాలు నల్లగా పెట్టుకొని స్రవంతి, ఆమె భర్త వేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు. రెండు రోజుల ముందునుండే ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలయ్యింది. హైదరాబాదులో దిగారు. డాక్టరుకు చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ చలికి, శారీరిక ఒత్తిడికి తీవ్రతరమయ్యాయని డాక్టర్ చెప్పాడు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుట పడటానికి ఒక రెండు నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వేంకటేశ్వరరావు మోశాడు. భార్యను కంటికిరెప్పలా కాపాడుకున్నాడు.
ఆ రెండు నెలలూ వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, ఆ చలి, పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత చర్చాంశాలు. భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది.
స్రవంతి నుండి తల్లికి ఫోన్ – “అమ్మా! మీరు ముందు వచ్చేశారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు. నాకు చాలా వస్తువులు కావాలి. మీరు కొని ఇవ్వండి…”
వేణి మనసు ఉగ్రమైంది. “స్రవంతీ! మా దగ్గర ఇంక వనరులు లేవు. మా సేవింగ్స్ అంతా ఖర్చైపోయాయి. మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బతికాం. ఇప్పటివరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాము. కానీ, ఇక మా వల్ల కాదు. నీ ఆడంబరాలకు, నీకు నిరంతరం సప్లై చేయటానికి మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయనో నువ్వో మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి. మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టము. అంతే కాదు, ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నాకు చేతనైంది వండి పెడతాను. కానీ మీ గొంతెమ్మ కోర్కేలు తీర్చలేను. సారీ అమ్మా! ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు”.
స్రవంతి నోట మాట రాలేదు. ఫోన్ పెట్టేసింది. వేంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. “వేణీ! ఈ పనే రెండేళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది? మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైన మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్‌గా చేరతాను. నాకు ఓపిక ఉన్నన్నాళ్లూ చేస్తాను. మన ఇద్దరి వరకూ హాయిగా జరిగిపోతుంది. పిల్లల పెళ్లిళ్లు చేశాము చాలు. మన బాధ్యత అంతటితో ముగిసింది. ఇకనైనా వారికోసమే బతుకకుండా మన ఆనందం, మన స్వీయోద్ధరణకు సమయాన్ని వెచ్చిద్దాం. ఏమంటావ్?”
“అవునండీ! నాకు కూతుళ్లిద్దరూ కనివిప్పు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు. మీ మాటే నా మాట. మన ప్రతిక్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి. అలాగే చేసుకుందాం”
మరునాడు స్రవంతి ఫోన్ చేసింది. వేంకటేశ్వరరావు ఇలా చెప్పాడు – “చూడమ్మా! మా జీవితమంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాము. ఉద్యోగాలు, పెళ్లిళ్ల వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించ కుండా అక్కడి పరిస్థితులకు భయపడి, అక్కడ అడ్జెస్ట్ అవ్వకుండా, ఇక్కడి మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవరిస్తున్నారు. మీ పిల్లలు మీ బాధ్యత. మాది కాదు. మేము ఇప్పుడు సంపాదించే వయసు దాటి పోయాము. మీరు 25 ఏళ్లు దాటినా కూడా స్వావలంబన లేకపోవటం ఒకరకంగా మా పెంపకంలో లోపమే. మేము దీనిని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకొని మీ పనులు, మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి.”
నెల తరువాత దంపతులిద్దరూ ఉత్తర భారత దేశ యాత్రకు ఒక ఇరవైమంది స్నేహితులతో కలిసి రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాలికలు సిద్ధం చేయటంలో మునిగిపోయారు.