‘సరదాగా పార్కు వరకూ వెళ్లొద్దాం రారా…’ అని పక్కింటి తాతయ్య అడిగితే తోడుగా వెంట వెళ్లాడు చక్రి. వాళ్లు వెళ్లేటపుడు వెలుతురు బాగానే ఉంది. కానీ తిరిగొచ్చే సమయానికి చీకటి పడిపోయింది. ఆ దార్లో వీధిలైట్లు కూడా లేవు. నడుస్తూ పక్కకు తిరిగి చూసిన తాతయ్యకు ఒక్కసారిగా చక్రీ టీ షర్టు మీద పుర్రె బొమ్మ మెరుస్తూ కనిపించింది. అంతే… ఆయనకు చెమటలు పట్టేశాయి. ఇందులో ఏ మంత్రం లేదూ తంత్రం లేదు. అంతా ‘గ్లో ఇన్ ది డార్క్ టీ షర్టులు’ చేసే మాయే. ఏటా ఎన్నో కొత్త ఫ్యాషన్లు వస్తుంటాయి. కొత్త కొత్త ప్రింట్లూ బోలెడు పుట్టుకొస్తుంటాయి. కానీ ఎవర్‌గ్రీన్ ట్రెండ్ ఏదంటే… టీ షర్టులే. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ సౌకర్యంగా ఉండడంతో పాటు రోజువారీ వేసుకోవడానికీ పార్టీలక్కూడా టీ షర్టులు బాగుంటాయి. అలా అని ఎప్పుడూ కొటేషన్లూ ఏవో బొమ్మలూ ఉన్న టీ షర్టుల్నే వేసుకుంటే కొత్తేముందీ అనిపిస్తుంది. ఇక, స్నేహితులతో పార్టీలకెళ్లేటపుడైతే వీలైనంత క్రేజీగా వినూత్నంగా తయారవ్వాలనుకుంటారు కుర్రకారు. అలాంటివారికోసం అరంగేట్రం చేసినవే ‘గ్లో ఇన్ ది డార్క్ టీ షర్టులు’. ఈ చొక్కాల ముందుభాగంలో ఉండే బొమ్మల మీద చీకట్లో మెరిసే ఫ్లోరసెంట్ పెయింట్‌ని వేస్తారు. దాంతో పగటిపూట మామూలుగానే కనిపించే ఇవి రాత్రి విద్యుత్ లైట్లలా మెరుస్తూ దర్శనమిస్తాయి. చీకట్లో వెళుతున్నపుడు మనం కనిపించకుండా షర్టుమీద ఉన్న బొమ్మ మాత్రం ఇలా మెరుస్తూ నడుస్తున్నట్లూ కనిపిస్తుంటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే మరి. అందుకే, రాత్రిపూట పార్టీలకూ సినిమాలకూ షికార్లకూ వెళ్లే కుర్రకారు ఈ చీకట్లో మెరిసే షర్టుల్ని వేసుకుని తెగ పోజు కొట్టేస్తున్నారు. ఇక, టీనేజీ అబ్బాయిలూ అమ్మాయిలూ వీటిని ఫ్యాషన్‌గా ఒంటి మీదికెక్కించేస్తుంటే చిన్న పిల్లలు ఈ షర్టులు చేసే మ్యాజిక్‌కి ఫిదా అయిపోతున్నారు. వీటిని వేసుకుని అబ్రకదబ్ర అంటూ గదిలోని లైటు తీసి మరీ మ్యాజిక్‌ని స్నేహితులకు చూపించి సరదాపడిపోతున్నారు. అన్నట్లూ… చీకట్లో మెరుస్తాయి కదా అని ఎప్పుడూ రాత్రిపూట మాత్రమే వేసుకుంటే ఈ షర్టులు అంతగా మెరవవు. ఎందుకంటే, ఫ్లోరసెంట్ పెయింట్ లైట్ల నుంచీ సూర్యుడి వెలుగు నుంచీ కాంతిని గ్రహించి చీకట్లో ఆ వెలుగుని వెదజల్లుతుంది. అందుకే, వీటిని పగలు వేసుకోకపోయినా కబోర్డులో కాకుండా కాంతి తగిలేలా ఉంచాలి. ఇక, ఈ చీకట్లో మెరిసే టీ షర్టుల్లో కుక్క, నక్క, పులి… లాంటి జంతువులతో పాటు దేవతా మూర్తుల రూపాలూ పుర్రె, అస్థిపంజరం… వంటి చిత్రాలు కూడా వస్తున్నాయి.
ఈ చొక్కా చీకట్లో వెలుగుతుంది
Related tags :