దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన.
మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…
ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…
కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…
తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..
పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…
పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…
గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…
అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…
ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .
“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…
మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వారమైన మనకే ఎంతో అవమానం…
ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..
అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..
“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”
అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…
కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…
అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…
“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…
తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..
మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…
చిత్ర పరిశ్రమకు సంభందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..
గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..
ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలో మారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..
“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..
ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..
అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..
కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..
మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..
“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్న అక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..
అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…
మీరే చదవండి .తెలుస్తుంది .
శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…
అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…
ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…
మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…
ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…
ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…
అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…
ఆ తరువాత అందులోని విషయాన్ని సంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…
ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…
“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ ఉగాదులూ వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…
ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…
అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..
“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..
ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…
చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…
దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…
“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…
నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…
నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”
తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపడి మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..
ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…
అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాడించారు శాస్త్రిగారు…
“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”
వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…
“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..
“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”
దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు..
దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..
“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”
“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…
ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…
కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…
“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…
గుండె పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…’” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..
వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…
అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…
వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…
“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..
“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”
“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….
ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా వున్నారు…
అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..
ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..
మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు
“…అయ్యా మీరిక్కడేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా ” అని…
దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..
“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..
అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…
ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..
సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..
ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..
ఆ పాటే…అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…
వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…
“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం)
“.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు)
“..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం)
“..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం)
మొదలైనవి…
ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..
“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ… రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..
ముక్తాయింపు
“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” –కృష్ణపక్షం. జాతీయగీతం అనిపించే ‘జయ జయ ప్రియభారత జనయిత్రి’ రచయిత గానేకాక ఎన్నో సినీ లలితగీతాలను మనకందించిన శ్రీ దేవులపల్లి వారిగురించిన ఈ వ్యాసం చాల చాల బాగుంది. చదివి సంతోషిస్తారు అనుకుంటాను.