ఏడు గంటలైతే చాలు… ఆ వాకిట్లో గుంపులుగా జనం చేరతారు. అందరూ నిరుపేదలే. వేడివేడిగా పొగలు కక్కే మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలను వాళ్లందరికీ అందిస్తుందామె. నాలుగు ఇడ్లీలు తిని… కడుపు నిండి వెళ్లే వారిని చూసి ఆనందపడుతుంది. పచ్చడి, సాంబారుతో కలిపి వడ్డించే ఆ ఇడ్లీ ధర రూపాయే. లాభాల కోసం కాదు… ఆకలి తీర్చడానికే ఈ అల్పాహారం అందిస్తున్నానని చెబుతోన్న ఆ అవ్వ తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల కమలత్తాళ్. తమిళనాడు పెరూర్‌కు సమీపంలోని వడివేలంపాలెయం ప్రాంతానికి చెందిన కమలత్తాళ్‌ది పెద్ద రైతు కుటుంబం. పెళ్లైన తరువాత ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి అందరూ వ్యవసాయ పనులకు వెళ్లిపోయేవారు. ఖాళీ సమయంలో ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఇడ్లీల వ్యాపారం. 30 ఏళ్లుగా పిండి రుబ్బడం నుంచి ఇడ్లీలు వేయడం వరకు అన్నీ ఆమే చేస్తోంది. ‘అప్పట్లో స్థానికంగా ఉండేవారి కోసం ఇడ్లీలు వేయడం మొదలుపెట్టా. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిమంది వీటి కోసం వస్తున్నారు. మా ఇంట్లోనే దీన్ని నిర్వహిస్తున్నా. కొన్నేళ్లుగా అదే రుచితో ఇడ్లీలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ప్రశంసించి మరీ వెళ్తారు. మొదటి నుంచీ పిండి రుబ్బడానికి, పచ్చడి తయారు చేయడానికి రుబ్బురోలునే వాడుతున్నా’ అని చెబుతుందీ అవ్వ. ముందు రోజే సరిపడా బియ్యం, మినప్పప్పు రుబ్బి నానబెడుతుంది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకల్లా వేడివేడి ఇడ్లీలు సిద్ధం చేస్తుంది. ‘ఒక్క వాయిలో 37 ఇడ్లీలు వచ్చే పాత్రను వాడుతున్నా. మధ్యాహ్నం వరకు వేస్తూనే ఉంటా. రోజుకి వెయ్యికి పైగా ఇడ్లీలు అమ్ముడుపోతాయి. 20 ఏళ్లపాటు ఒక్కో ఇడ్లీని 50 పైసలకు అమ్మాను. ఇప్పుడు రూపాయికి ఒకటి చొప్పున… పచ్చడి, సాంబారుతో అరటి ఆకుల్లో అందిస్తున్నా. లాభం కన్నా… ఎక్కువ మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం. ఇక్కడికి అల్పాహారానికి వచ్చేవారిలో 90 శాతం మంది నిరుపేదలే. వారి సంపాదనలో టిఫిను రూపంలో ఎంతో కొంత మొత్తం నావల్ల మిగిలితే చాలని అనుకుంటా. ఖర్చులు పోను రోజుకు 200 రూపాయల వరకు మిగులుతాయి. ఇంత తక్కువ సంపాదన కోసం ఈ వయసులో కష్టపడటం అవసరమా అని కుటుంబసభ్యులు అంటారు. నేనున్నంత వరకు దీన్ని కొనసాగిస్తానని వాళ్లకు సమాధానమిస్తుంటా. ప్రస్తుతం మా చుట్టుపక్కల ఉన్న బొలువంపట్టి, పూలువంపట్టి, తేన్‌కరై, మదిపాలెయం ప్రాంతాల నుంచి చాలామంది ఇడ్లీల కోసం వస్తారు. రుచికి, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తా. ఎందరొచ్చినా ఇడ్లీ ధర మాత్రం పెంచను’ అని అంటోంది కమలత్తాళ్.
ఈ అవ్వ అపర అన్నపూర్ణ
Related tags :