Editorials

ఆంధ్రుల ఉనికిని నాశనం చేయాలని మోడీ కుట్ర

Modit Govt Trying To Degrade Andhrites-Machilipatnam Press Condemns Andhra Bank Merger

ఆంధ్రులకు గుర్తింపు లేకుండా చేయాలన్న కేంద్రం కుట్రే ఆంధ్రాబ్యాంక్ విలీనం అంశమని పలువురు జర్నలిస్ట్స్ సంఘ నాయకులు, ప్రజాసంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వం చర్యలను దుయ్యబట్టారు.మంగళవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జెడ్పీ సెంటర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహం వద్ద పెన్ జర్నలిస్ట్స్ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా బ్యాంకు విలీన ప్రతిపాదన ను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్ట్స్ , ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ 96 సంవత్సరాల క్రితం బందరులో పురుడు పోసుకున్న ఆంధ్రా బ్యాంకు ను బొంబాయి కేంద్రంగాగల యూనియన్ బ్యాంక్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కేంద్రప్రభుత్వ దుర్మార్గపు చర్యని, ఆంధ్రప్రదేశ్ కున్న ఘన చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం అని మండిపడ్డారు. నాలుగు పదుల వయసు గల పంజాబ్, మహారాష్ట్ర బ్యాంకు లను వదిలి శతవత్సరాల చరిత్ర గల దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా చరిత్రకెక్కిన ఆంధ్రుల ఆంధ్రాబ్యాంక్ ని విలీనానికి పూనుకోవడం ఆంధ్రుల అస్థిత్వాన్ని విలీనం చేయడమేనన్నారు. తెలుగు వారికి భావోద్వేగ అంశమని, తెలుగు వారి మనోభావాలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నతీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పంజాబ్ బ్యాంకు జోలికెళితే సిక్కులు తాట తీస్తారని, మహారాష్ట్ర బ్యాంకు జోలికెళితే శివసేన శివమెత్తుతుందని, మోడీకి ఆంధ్రప్రదేశ్ తెలుగోళ్ళు తేలిగ్గా మోసం చేయడం లో ఆరితేరారని ఆవేశం వ్యక్తం చేశారు. ఈ విలీన విషయంలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాలని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారిపైనుందని పలువురు పాత్రికేయులు విజ్ఞప్తి చేశారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సంఘ నాయకులు బడే ప్రభాకర్, ఈదా రాంబాబు, జిల్లా, మచిలీపట్నం నియోజకవర్గ సంఘ నాయకులు సనకా ప్రసాద్, సామర్ల మల్లికార్జునరావు, గంధం చిరంజీవి, వంగరశర్మ, గోట్రు రాజేంద్ర ప్రసాద్, ఏలేటి రాజేశ్వరరావు, వీఆర్ఎమ్వీ ప్రసాదరావు, కూరేటి సతీష్, వక్కలంక రామకృష్ణ, తిరుమాని మురళి, దేవనబోయిన రాజేష్, మోపిదేవి శివరాం,కమ్మిలి విజయ్,వల్లభనేని రాజర్షి, అనంత సురేష్, మోడీ తాతయ్య, మండవల్లి రాజేష్, ప్రజాసంఘాల నాయకులు కొడాలి శర్మ, జంపాన శ్రీనివాసరావు గౌడ్, కేవీపీఎస్ నాయకులు రాజేష్, తదితరులు పాల్గొని ప్రసంగించారు.ముందుగా దివంగత పట్టాభి సీతారామయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.